25 July, 2026 | 2:29 AM

విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి!

25-07-2026 01:14 AM

కోవలెంట్ పరిశ్రమపై గుండ్ల మాచునూరు పాలకవర్గం ఆగ్రహం

పీసీబీకి ఫిర్యాదు

నర్సాపూర్ (హత్నూర), జూలై 24: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్ల మాచునూర్ శివారులో ఉన్న కోవలెంట్ పరిశ్రమ నుంచి శుక్రవారం భారీగా విషవాయువులు విడుదల కావడంతో గ్రామమంతా దుర్వాసన వ్యాపించి ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. పలువురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ శంకర్తో పాటు వార్డు సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఇష్టానుసారంగా వాయు, జల కాలుష్యాన్ని విడుదల చేయడంతో గ్రామంలో నివాసయోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాయిలర్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ముతో ఇళ్లపై ధూళి పేరుకుపోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే సమర్థవంతమైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకుంటే గ్రామస్తులతో కలిసి పరిశ్రమను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి పరిశ్రమపై సమగ్ర విచారణ జరిపి కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భద్రేశ్, అంకిత, ప్రభాకర్, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు