ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు?
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్న
కేసీఆర్ కంటే ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని సవాల్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి) : కాంగ్రెస్ నాయకులు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కూడా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశం లో కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తే ఎప్పడు నోటిఫికేషన్, రాత పరీక్ష జరిపారో తేదీలు చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి అసత్యాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఏప్రిల్ 2023లో గురుకులాల్లో 9210 టీజీటీ, పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఆగస్టులో పరీక్షలు జరిగాయని తెలిపారు. వాటి ఫలితాలు ఫిబ్రవరి 2024లో వచ్చాయని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కూడా 17,516 ఉద్యోగాల పరీక్ష ఫలితాలు 4 అక్టోబర్ 2023లో విడుదలైనా ఎన్నికల కోడ్ మూలంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిన సీఎం రేవంత్ ఆ ఉద్యోగాలు తామే ఇచ్చానని పేర్కొనడం సీఎం దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
స్టాప్ నర్సుల పోస్టులు కూడా తామే ఇచ్చామని కాంగ్రెస్ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాదని విరుచుకపడ్డారు. మొత్తం 32,517 పోస్టుల కేసీఆర్ ఇచ్చినవేనన్నారు. కేసీఆర్ పాలనలో 1,92,600 ఉద్యోగాలు భర్తీ చేశారని, మేం పరిపాలన అనుమతులు ఇచ్చిన ఉద్యోగాలు 2.32లక్షలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, బీఆర్‌ఎస్ ఏడాదికి 19వేలు ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 24వేల పరిశ్రమలకు అనుమతి ఇచ్చి 4లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు వెల్లడించారు.
మా కంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఇచ్చినట్లు చూపించినా తెల్లాసరికి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. దీనీ మీద ఆరు నెలలుగా సవాల్ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల నుంచి సమాధానం లేదని, తెలంగాణ యువత నెత్తి నిండా అబద్ధాలు సోషల్ మీడియా ద్వారా నింపి పెట్టారని విమర్శించారు. ఆరు నెలల్లో ఒక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదని, తాము ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి దానికి 60పోస్టులు కలిపి మరో నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చారని, స్వయంగా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ నోటి నుంచి నిరుద్యోగ భృతి అనే మాట చెప్పించారని, ఆ తరువాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ అసత్య ప్రచారాన్ని రాష్ట్ర యువత నమ్మవద్దని పట్టుభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.






