27 July, 2026 | 5:07 AM

కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు

30-05-2024 12:26 AM

మరో వారం పొడిగించాలని అభ్యర్థన

పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

 న్యూఢిల్లీ, మే 29 : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను మరో వారం రోజులు పొడిగించాలని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తదుపరి ఆదేశాల కోసం ఈ అంశాన్ని ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు పంపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మూ డు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ గడువు జూన్ 1తో ముగియనుండగా.. ఆయన జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడు రోజుల పాటు బెయిల్‌ను పొడిగించాలని, జూన్ 9న లొంగిపోయేందుకు అనుమతించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. 

బరువు తగ్గా, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా..

కాగా, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్ పిటిషన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన బరు వు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేరకు తగ్గిపోయిందని అన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగానే బెయిల్ పొడగించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా, మే 10వ తేదీన ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.