calender_icon.png 13 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం

30-11-2024 10:16:53 PM

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.విఎల్.రాజు

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైనదని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించమని సుప్రీంకోర్టు తన తీర్పులో అసలు ప్రకటించలేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.విఎల్.రాజు, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341, 342 ప్రకారం పార్లమెంట్ చర్చ జరగాలని వారు స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో 'ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా' జరిగిన రాష్ట్ర స్థాయి నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఏఐసీసీ నేతలు ఏలాంటి నిర్ణయిం తీసుకోకముందే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ నియమించడం తీరని ద్రోహమన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాలలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి రేవంత్ రెడ్డిని సీఎంగా చేశారని అన్నారు. మాదిగలు బీజేపీకి ఓట్లు వేశారని, వర్గీకరణ పేరుతో రేవంత్ రెడ్డి మాలలకు వెన్నుపోటు పోడిచారన్నారు. మాల, మాదిగలను విడదీయడానికి సీఎం రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహతో, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు.

పరేడ్ గ్రౌండ్ లో జరిగేది మాలల సింహగర్జన సభ కాదని కాంగ్రెస్ సభ అని, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కోసమే ఈ సభను నిర్వహిస్తున్నారని విమర్శించారు. మాల ప్రజా ప్రతినిధులు ఏకసభ్య కమిషన్ పై అసెంబ్లీలో చర్చించాలని, సీఎంని నిలదీయాలని సూచించారు. వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా డిసెంబర్ 7 నుంచి జనవరి 26వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల ఇళ్ల ముంగిట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సదన్సులో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ, హైకోర్టు న్యాయవాది వెంకట్ రావు, మాల మహానాడు నాయకులు జెఎన్.రావు, గవ్వల శ్రీకాంత్, దేవేందర్, రోజాలీలా పాల్గొన్నారు.