30-11-2024 10:25:53 PM
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని టీబీజీకేఎస్ సెంట్రల్ నాయకుడు, సింగరేణి ఉద్యోగి, రచయిత సుదర్శనం రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు పుస్తకాన్ని శనివారం ఆయన పదవి విరమణను పురస్కరించుకొని మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు సింగరేణి ఉద్యోగిగా, అటు కార్మిక సంఘ నాయకుడిగా పనిచేస్తూ రచయితగా పుస్తకాలు రాయడం ఎంతో గర్వకారణమన్నారు. సుదర్శనం రంగనాథ్ రచించిన కవితలు, వ్యాసాలు, పుస్తకాలకు ఎన్నో బహుమతులు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. వారి శేష జీవితం సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సుదర్శనం రంగనాథ్ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుదర్శనం రంగనాథ్ కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.