ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి జయంతి
వనపర్తి, మే 28 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికులు, ప్రథమ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సురవరం ప్రతాపరెడ్డి పార్కులో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ విశ్లేషకులు వి.ప్రకాశ్, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, వక్తలు, విశ్లేషకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి చరిత్రను సమాజానికి తెలియజేయడానికి మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. సురవరం కవి, రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో సేవలందించారని కొనియాడారు. తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలంటే ఆయన రచించిన పుస్తకాలు చదవాలని సూచించారు. తెలంగాణ కవులను ప్రపంచానికి పరిచయం చేస్తూ గోల్కొండ సంచికను తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు వి.ప్రకాశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ పాలమూరులో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. సరళాసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సైఫన్ సిస్టమ్ను వనపర్తికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఒకప్పుడు గట్టు మండలంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండేవని, కృష్ణా నీటికి నోచుకోక ఎడారి ప్రాంతంగా మారేదని తెలిపారు. ప్రస్తుతం పల్లెలు పునరుజ్జీవం పొందుతున్నాయని, వలస వెళ్లిన ప్రజలు తిరిగి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో కవులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు






