సురేశ్‌బాబు, అల్లు అరవింద్, రమేశ్ ప్రసాద్.. ఇండస్ట్రీని పీడిస్తున్నారు!
- డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి: ప్రతాని రామకృష్ణ గౌడ్
- ఇండస్ట్రీ కోసమే వీళ్ల పోరాటం: ప్రసన్నకుమార్
చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించకుండా, చిన్న నిర్మాతల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వారి తీరు మారాలని ‘దీక్ష’ మూవీ దర్శక నిర్మాత, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ‘దీక్ష’ మూవీ టీమ్ సోమవారం మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద ఈ మహాధర్నాకు రామకృష్ణగౌడ్ నేతృత్వం వహించారు. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరో కిరణ్, షెరాజ్ మెహదీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “థియేటర్ల గుత్తాధిపత్యం వీడి, వీపీఎఫ్ ఛార్జీల భారం తగ్గించాలి.
ఒక చిన్న నిర్మాత తన సినిమా రిలీజ్ చేసుకోవాలంటే వీపీఎఫ్ ఛార్జీలు ఐదు నుంచి పది లక్షలు అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల్లో రూ.2 వేలు, రూ.3 వేలు ఉంటే మన దగ్గర రూ.పది వేల నుంచి పదిహేను వేల రూపాయలు వారానికి వసూలు చేస్తున్నారు. సినిమా బాగా లేదంటూ రెండు మూడు రోజులకే సినిమా తీసేస్తున్నారు. మరి ఆ వారం రోజులకు కట్టించుకున్న ఛార్జీలు తిరిగి ఇవ్వడం లేదు. సురేశ్‌బాబు, అల్లు అరవింద్, రమేశ్ ప్రసాద్ వీళ్లంతా ఒక్కో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ తరుపున పనిచేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తు న్నారు. రామానాయుడుకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. కానీ, ఆయన కొడుకు సురేశ్‌బాబు ఇండస్ట్రీని పీడిస్తున్నాడు.
ఫిలింఛాంబర్‌లో పదవులు అనుభవిస్తూ ఇలా దోపిడీ చేస్తున్నారు. ఇటు డిజిటల్ దోపిడీ చేస్తున్నారు. అటు మల్టీప్లెక్సులు కట్టి అక్కడ టికెట్ రేట్స్ పెంచి, తినుబండారాల రేట్స్ పెంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా చేస్తున్నారు. అందుకే ఐ బొమ్మ రవికి కూడా ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభించింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి. థియేటర్స్ అందరికీ ఇవ్వాలి. లేకుంటే ఈ పోరాటం తీవ్రరూపం దాల్చుతుంది.
ఈ సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలి” అన్నారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. “అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు డిజిటల్ ఛార్జీలు వసూలు చేయరు. బాంబేలో చాలా తక్కువ. మన దగ్గర డిజిటల్ ఛార్జీలే పెనుభారంగా మారాయి. వీళ్లు చేస్తున్న పోరాటం మొత్తం ఇండస్ట్రీ కోసం. గతంలో ప్రభుత్వ నేతలకు చాలాసార్లు ఈ విషయం చెప్పాం.
ఫిలింఛాంబర్ నుంచి కూడా ప్రయత్నం చేశాం. మల్టీప్లెక్సుల్లో కూడా తమిళనాడులా కింద తరగతి టికెట్ ఉండాలి. నేను వీళ్లకు పరిశ్రమ తరపున సంఘీభావం తెలిపేందుకు వచ్చా” అన్నారు. నిర్మాతలు జేవీఆర్, గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరోలు షెరాజ్ మెహదీ, కిరణ్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాత చావు బతుకుల్లో ఉన్నాడని, చిన్న సినిమాను కాపాడేందుకు ఇలాంటి మహాధర్నాలు జరగాలని, నిర్మాతలంతా ఒక్కటి కావాలని, రామకృష్ణ గౌడ్ పోరాటానికి మేమంతా మద్ధతు ఇస్తున్నామని తెలిపారు.






