27 April, 2026 | 5:02 AM

బీజేపీ సర్జికల్ స్ట్రైక్

28-04-2024 01:22 AM

రిజర్వేషన్ల రద్దుకు కమలం పార్టీ కుట్ర

l వాటి రద్దుకు భారీ మెజార్టీ కావాలి l అందుకే మోదీ 400 సీట్ల పాట 

l భారత్‌ను హిందూ దేశంగా మార్చే ఎత్తు l మోదీ మళ్లీ వస్తే రాజ్యాంగం రద్దే

l కోటా రద్దుచేస్తామని అమిత్‌షానే చెప్పారు l ఈ అంశాలపై కేసీఆర్ నోరు తెరువరెందుకు?

l రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను రద్దుచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి రిజర్వేషన్లను రద్దుచేస్తామని చెప్పారని గుర్తుచేశారు. రిజర్వేషన్లను రద్దుచేయాలంటే పార్లమెంటులో భారీ మెజార్టీ అవసరమని, అందుకే బీజేపీ, ప్రధాని మోదీ 400 సీట్ల నినాదం అందుకొన్నారని ఆరోపించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. ‘ఆరెస్సెస్ వందేండ్ల ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 2025 నాటికి ఆరెస్సెస్ ఏర్పడి వందేండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా భారత్‌ను హిందూ దేశంగా మార్చడం, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయడం, రిజర్వేషన్లు లేని దేశంగా భారత్‌ను నిలబెట్టడం అనే ఆ సంస్థ లక్ష్యాలను అమలుచేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది.

అందుకే ఈసారి ఎన్నికల్లో ‘అబ్ కీ బార్.. 400 పార్’ అంటూ నినాదం ఎత్తుకుంది. బీఆర్ ఆంబేద్కర్ సమాజంలోని అసమానతలను రూపు మాపేందుకు ఏర్పాటుచేసిన రాజకీయ, ఉద్యోగ, విద్యాపరమైన రిజర్వేషన్లను తొలగించేందుకు రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అక్రమంగానో.. దౌర్జన్యంగానో 400 సీట్లను గెలిచి అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తోంది. గతంలో సూరత్‌లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగు పెట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఇప్పుడు అదానీ, అంబానీల రూపంలో సూరత్ నుంచే మొదలుపెట్టి దేశ సంపదను దోచుకుంటున్నారు. దేశంపై మోదీ, అమిత్‌షా సర్జికల్ స్ట్రుక్ చేస్తున్నారు. దేశం అత్యంత ప్రమాదంవైపు ప్రయాణిస్తున్నది. అందులో భాగంగానే హిందూ స్త్రీల పుస్తెలు కూడా గుంజుకుంటారని, ఆస్తులను స్వాధీనం చేసుకుంటారని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్నదమ్ముల ఆస్తులు కూడా విరాసత్ చేస్తేనే బదిలీ అవుతాయి.

భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవటానికి వీలు లేదని మొన్ననే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే రిజర్వేషన్లు వద్దనుకునేవారు బీజేపీకి ఓట్లు వేయండి. రిజర్వేషన్లు కావాలనుకునేవారు కాంగ్రెస్‌కు ఓట్లు వేయండి. రిజర్వేషన్ల అమలుతోపాటు.. జనాభా దామాషా ప్రకారం వాటిని పెంచేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని మోదీ, షా వంటి నేతలు తెలంగాణకు వచ్చి బహిరంగంగానే చెప్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరేందుకు మెదపడం లేదని నిలదీశారు. ‘గతంలో కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పారు. బీజేపీ విధానానికి కేసీఆర్ ప్రభావితం అయ్యారా? లేక జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసం రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతుంటే ఈటల రాజేందర్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

మల్లారెడ్డిపై చర్యలేవి?

మల్కాజ్‌గిరిలో బీజేపీ గెలుస్తుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా చెప్పారని, మరి బీజేపీతో బీఆర్‌ఎస్‌కు నిజంగా వైరం ఉంటే , చీకటి ఒప్పందం లేకపోతే మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలేసి వందరోజుల తమ ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లో భోజనం చేస్తుండగా కరెంట్ పోయిందని ట్వీట్ చేసిన కేసీఆర్‌కు రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్.. బకాసురుడివా? రోజంతా తింటున్నావా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను రాష్ట్ర ప్రజలు బండకేసి కొట్టినా బలుపు తగ్గదలేదని మండిపడ్డారు.

బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్

బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దేశంలోని ఓబీసీలపై మోదీ సర్జికల్ స్రైక్ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ జనాభాను లెక్కించడం చారిత్రక అవసరమని అన్నారు. కింది కులాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఓబీసీలు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. బీసీ జనాభాను లెక్కించి దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే మతాలు, భాషలు, జాతుల మధ్య మోదీ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

రుణమాఫీకి వ్యూహం ఉంది

రైతు రుణమాఫీ ఎలా చేయాలో తన వద్ద వ్యూహం ఉందని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్తున్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులతో తాము ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని తెలిపారు భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని అంటున్న ఈటల రాజేందర్.. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ భూములు అమ్మినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. రైతులు చావాలని కేసీఆర్, ఈటల కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దుబారా ఖర్చులను తగ్గించామని తెలిపారు.