8 June, 2026 | 2:45 AM

అర్ధరాత్రి లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు

08-06-2026 01:01 AM

నాకాబందీ, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

మంచిర్యాల, జూన్ 7 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి లాడ్జీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొని తనిఖీలను పర్యవేక్షించారు. గదుల్లో బస చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకొని నేరుగా ఒక్కో గదిని పరిశీలించారు.

లాడ్జీల యాజమాన్యాలు, నిర్వాహకులకు ఈ సందర్భంగా డీసీపీ పలు సూచనలు చేసి, ఆదేశాలు జారీ చేశారు. లాడ్జీలకు వచ్చే ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వారి గుర్తింపు పత్రాలను ధృవీకరించాలన్నారు. లాడ్జీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలు, జిల్లాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపే లక్ష్యంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. మరోవైపు పట్టణంలో ఐబీ చౌరస్తా, లక్ష్మీ థియేటర్ ప్రాంతాల్లో ఆకస్మిక నాకాబందీ, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, ఎస్‌ఐ ఆది మధుసూదన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.