ఓటేసిన వారికి 50 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం సిగ్గీకి చెందిన టేబుల్ బుకింగ్ యాప్ డైనౌట్ శనివారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం పోలింగ్ రోజున ఓటేసిన వినియోగదారులకు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి తాము ఓటు వేసినట్లు రుజువుగా.. సిరా చుక్క ఉన్న వేలిని చూపించాల్సి ఉంటుందని స్విగ్గీ డైనౌట్ తెలిపింది. పోలింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రతి ఒక్కరూ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోవాలని సూచించింది. స్విగ్గీ డైనౌట్ యాప్‌తో టైఅప్ అయిన టాప్ రెస్టారెంట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఈ ఆఫర్ హైదరాబాద్ వాసులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోని బార్, పపయా, ఎయిర్ లైవ్, నొవొటెల్, లీ మెరీడియన్ వంటి టాప్ రెస్టారెంట్లలో ఈ ఆఫర్ పొందవచ్చని తెలిపింది. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, అదొక బాధ్యత అని స్విగ్గీ డైనౌట్ చీఫ్ స్వప్నిల్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు టాప్ రెస్టారెంట్లతో చేతులు కలిపినట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసి నచ్చిన రెస్టారెంట్లో ఇష్టమైన భోజనం తినాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.