16 May, 2026 | 2:40 AM

వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణపై టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్

16-05-2026 01:42 AM

మే 18న బూర్గంపాడులో మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం, మే 15, (విజయక్రాంతి): జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డిఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్స్సజ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందన, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితికేష్ ఠాగూర్, జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్తో పాటు డీఎఫ్‌ఓ, పోలీస్, రెవెన్యూ, ఎస్డీఆర్‌ఎఫ్, సాగునీటి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్డిఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ మాట్లాడుతూ జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు ,ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించబడిన నేపథ్యంలో వరదలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో విస్తృతంగా చర్చించారు.

జిల్లాలో అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాదాలు సంభవించిన సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలి, అగ్నిమాపక చర్యలను ఎలా చేపట్టాలనే అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.  18న బూర్గంపాడు మండలంలో నిర్వహించనున్న మాక్ ఎక్స్సజ్ను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఎన్డిఎంఏ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.