16 May, 2026 | 2:32 AM

ఏసీపీ మాధవి అద్భుత ప్రతిభ

16-05-2026 01:43 AM
  1. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పతకాల పంట
  2. జాతీయ స్థాయిలో కరీంనగర్ పోలీస్ కీర్తిని చాట మాధవి

కరీంనగర్, మే 15(విజయక్రాంతి):ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘అఖిల భారత పోలీస్ క్రీడా పోటీల‘లో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ ఏసీపీ మాధవి అద్భుత ప్రదర్శనతో రాణించి ఘన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గట్టి పోటీని తట్టుకొని, టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్కు కీర్తిని తెచ్చిపెట్టారు.

టేబుల్ టెన్నిస్ 

జి.ఓ. 50+ , మికస్డ్ డబుల్స్ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి రజత పతకం సాధించారు.జి.ఓ. 40+ విభాగం మికస్డ్ డబుల్స్ పోటీలలో గట్టి పోటీనిచ్చి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.ఎన్.జి.ఓ. విభాగం, మికస్డ్ డబుల్స్ విభాగంలో రాణించి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

బ్యాడ్మింటన్ విభాగం:

జి.ఓ. 50+ , మికస్డ్ డబుల్స్ పోటీలలో అద్భుత ఆటతీరుతో కాంస్య పతకం సాధించారు.జాతీయ స్థాయిలో ఒకే క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి భిన్నమైన విభాగాల్లో నాలుగు పతకాలు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం , సహచర అధికారులు ఘనంగా అభినందించారు. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉంటూనే, క్రీడల పట్ల మక్కువతో కఠోర శ్రమకోర్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.