పరిశ్రమలపై చర్యలు తీసుకోండి
పీసీబీ అధికారులను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, ఆగస్టు 24: జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం కలుషిత జలాలు తాగి 12 గేదెల మృతికి కారణమైన పరిశ్రమలపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి గగులోతును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం పీసీబీ మెంబర్ సెక్రటరీ రవితో ఫోన్‌లో ఎమ్మెల్యే మహిపాల్ మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా పటాన్‌చెరు నియోజకవర్గంలో కాలుష్యం తగ్గుతుంద నుకుంటున్న తరుణంలో.. కొన్ని పరిశ్రమలు హానికారక రసాయన జలాలను చెరువులు, కుంటల్లో విడుదల చేయడం మూలంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే కిష్టాయపల్లి గ్రామానికి చెందిన యువ రైతు బాశెట్టి సాయికుమార్‌కి చెందిన 12 గేదెలు ఇటీవల కాలుష్య జలాలు తాగి మృతి చెందాయని తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన సాయికుమార్ పాడి పరిశ్రమపై మక్కువతో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేస్తే..ఫార్మా పరిశ్రమల నిర్లక్ష్యం మూలంగా కోలుకోలేని ఆర్థిక నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. కాలుష్య జలాలను విడుదల చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన.. మెంబర్ సెక్రటరీ రవి.. వచ్చే వారంలో క్షేత్రస్థాయి పర్యటన చేసి.. వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.






