31 July, 2026 | 6:49 AM

30లక్షల ఆల్ఫాజోలం పట్టివేత

25-08-2024 12:22 AM
  1. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 
  2. నిందితులు ఫార్మా కంపెనీలో ఉద్యోగులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తునూ గుట్టుగా ఆల్ఫాజోలంను తయారు చేస్తున్న ఐదుగురి ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్‌రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన మేన శ్రీనివాస్ నాచారంలో ఉంటూ 2016వరకు వివిధ ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా పని చేశాడు.

సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కృత్రిమ కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫాజోలం మత్తు పదార్థాల తయారీకి పూనుకున్నాడు. కుత్భుల్లాపూర్‌కు చెందిన కాకర చంద్రశేఖర్, నాగోల్‌కు చెందిన పొలిశెట్టి రాంబాబు, వనస్థలిపురానికి చెందిన తాటి లక్ష్మణ్, కూకట్‌పల్లికి చెందిన నర్మదా కెమికల్స్ షాపు యజమాని రాజేశ్వర్‌రావుతో కలిసి ఘట్‌కేసర్ సమీపంలో రహస్యంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు.

కాచేవాణి సింగారం సమీపంలోని దివ్యానగర్ గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. రూ.30లక్షల ఆల్ఫ్రాజోలం సీజ్ చేసినట్లు చెప్పారు.