మేరా యువ భారత్ కార్యక్రమానికి తారా కళాశాల విద్యార్థుల ఎంపిక
సంగారెడ్డి, ఏప్రిల్ 12: హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో ఈనెల 12, 13 తేదీలలో నిర్వహించనున్న మేరా యువ భారత్ కార్యక్రమానికి తారా కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం యువతను పరిపాలనలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా బడ్జెట్ క్వెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించగా, దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా యువత పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో నుండి చాలా కొద్ది మందిని మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆన్లైన్ ద్వారా సంభాషణకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ ఎంపికలో భాగంగా తారా కళాశాలకు చెందిన సాధన్ సదాఫ్ (బి.ఏ. ప్రథమ సంవత్సరం), తనుజ్ గౌడ్ (బి.కాం ద్వితీయ సంవత్సరం), అఖిల (బి.కాం ప్రథమ సంవత్సరం) ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో నిర్వహించబడుతుండగా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో ఈనెల 12, 13 తేదీలలో జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రితో సంభాషించే ఈ అపూర్వ అవకాశం తమ కళాశాల విద్యార్థులకు లభించడం కళాశాలకు గర్వకారణమని డాక్టర్ ప్రవీణ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.




