హుస్నాబాద్‌లో చెక్‌డ్యాంలు, చెరువులు, అర్బన్ ఫారెస్ట్‌తో అభివృద్ధి
అంగన్వాడి కార్యకర్తలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ
రైతులకు యంత్రాలు, చెరువుల అభివృద్ధిపై దృష్టి
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఏప్రిల్ 12: హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సుడిగాలి పర్యటన నిర్వహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఆదివారం రోజున కూచనపల్లి గ్రామంలో రూ.21.30 లక్షల వ్యయంతో మర్రి పంపు చెక్డ్యాం ఫీడర్ చానెల్ పనులకు శంకుస్థాపన చేసి, సాగునీటి సదుపాయాల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులను మంత్రి సమీక్షించారు. చెరువుల సుందరీకరణ, కట్టల బలోపేతం, గ్రీనరీ, ఓపెన్ జిమ్, వ్యూ పాయింట్లు వంటి సౌకర్యాల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. డ్రైనేజీ నీరు చెరువుల్లో కలవకుండా ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువుల అభివృద్ధిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
హుస్నాబాద్ పట్టణంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను పరిశీలించిన మంత్రి, పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే పార్క్ సదుపాయాలు, ట్రెక్కింగ్ ట్రాక్లు, గ్రీన్ లేన్లు, వాచ్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో కేబుల్ బ్రిడ్జ్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చిగురుమామిడి మండలంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సుమారు రూ.40.80 లక్షల విలువైన పనిముట్లను పంపిణీ చేశారు.
ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కనీసం 50 నుంచి 100 ఎకరాల వరకు ఈ పంట సాగు చేయాలని సూచిస్తూ, అధిక లాభాల కోసం ఇది ఉత్తమ మార్గమని తెలిపారు. అవసరమైన వారికి అదనపు వ్యవసాయ పరికరాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పోతారం జె గ్రామంలో వర్షాధారిత పంటల అభివృద్ధి పథకం కింద రైతులకు కూరగాయల పెట్టెలను అందజేశారు. కూరగాయలు, ఆయిల్ ఫామ్, పట్టు, తేనెటీగల పెంపకం వంటి ఆదాయపరమైన పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. హుస్నాబాద్లో వెజిటేబుల్ కోల్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థాపన కోసం చిగురుమామిడి లో స్థలాన్ని పరిశీలించిన మంత్రి, ఆధునిక సౌకర్యాలతో విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, రవాణా శాఖ కార్యాలయాలు, ఇండస్ట్రియల్ కారిడార్, నాలుగు లేన్ రోడ్డు వంటి కీలక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.




