12 April, 2026 | 2:03 AM

మూడు నెలల రేషన్.. పరేషాన్!

12-04-2026 12:13 AM
  1. సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులకు ఇబ్బందులు
  2. దుకాణాల వద్ద బారులు తీరుతున్న ప్రజలు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అమలులో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విధానంలో రేషన్ సరుకుల పంపణీ ప్రారంభం కాగా రేషన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంటుంది. దీంతోపాటు సాంకేతిక సమస్యలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, మూడు నెలల బియ్యం పొందేందుకు లబ్ధిదారులు ఈ- యంత్రంపై మూడు సార్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయాల్సి వస్తోంది. ప్రతి నెలకు విడిగా వేలిముద్ర ఇవ్వాల్సి రావడంతో ఒక్కో కార్డుకు 20 నుంచి 30 నిమిషాల వరకు సమయం పడుతోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు బయోమెట్రిక్ వినియోగించడంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి, వ్యవస్థ నెమ్మదించడంతో పాటు వేలిముద్రలు సరిగా నమో దు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

దీంతో ప్రజలు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మండుతున్న ఎండలు ప్రజల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు రేషన్ దుకాణాల వద్ద ఎక్కువసేపు నిలబడాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రద్దీని తగ్గించేందుకు కొన్నిచోట్ల టోకెన్ విధానం అమలు చేస్తున్నప్పటికీ, అది పూర్తిస్థాయిలో ఫలితం ఇవ్వకుండా మరింత గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు, గోదాముల నుంచి సరఫరా అవుతున్న బియ్యం బస్తాల్లో తూకం తక్కువగా ఉంటోందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.

50 కిలోల బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు లోటు ఉంటోందని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు చెబుతున్నారు. అదనంగా, మూడు నెలల సరుకును ఒకేసారి నిల్వ చేయడానికి తగిన స్థలం లేకపోవడం కూడా డీలర్లకు పెద్ద సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమవుతున్న రేషన్ పంపిణీ గడువును ఏప్రిల్ 30 తర్వాత కూడా పొడిగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే, మూడు సార్లు బయోమెట్రిక్ ధృవీకరణ చేయాల్సిన విధానాన్ని సవరించి, ఒకే సారి వేలిముద్రతో మూడు నెలల రేషన్ అందేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.