25-05-2025 09:06:38 PM
కనుమరుగు అవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడండి..
ప్రపంచాన్ని దినపత్రికలు చూపిస్తాయి.. చదివించండి..
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. మై విలేజ్ మాడల్ విలేజ్ ఫౌండేషన్ సౌజన్యంతో, వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం స్థానిక మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను, తల్లిదండ్రులను అభినందించి మాట్లాడుతూ... కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను ఈవిధంగా విద్యార్థులకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మంచి ఏది? చెడు ఏది? అని మనం నేర్పించకపోతే మన పిల్లలు వారి భవిష్యత్తును నష్టపోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. సెల్ ఫోన్ లకు మీ పిల్లలను దూరంగా ఉంచాలని, టివి లు, సినిమాల ప్రభావంతో వారిపైన చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మనం మన పిల్లలను కనిపెడుతూ ఉండాలి అని ఆయన చెప్పారు. మన పిల్లలను సరియైన మార్గంలో పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. నిర్వాహకులు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నో విదేశీ దండయాత్రలను తట్టుకొని మన సంస్కృతి సాంప్రదాయాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఏదేని ఒక దినపత్రిక చదువడం అలవాటు చేసుకోవాలి అని సూచించారు. లక్షలు ఖర్చు చేసినా లభించనిది కేవలం దిన పత్రికలు చదవడం వల్ల పొందవచ్చు అని, అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్ నాలెడ్జ్ తో పాటు ప్రపంచ దేశ సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్పారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దిన పత్రికలను చదవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారందరూ కూడా దిన పత్రికలను చదివిన వారే ఉంటారని చెప్పారు. తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కు పోవాలని, మీ పిల్లల యొక్క ప్రొగ్రెస్ ను ఎప్పటికిప్పుడు తెలుసుకోవాలని ఆయన చెప్పారు.
సెలవులు ఎప్పుడూ వచ్చినా పిల్లలకు సాంప్రదాయ కళలను నేర్పించాలని ఆయన చెప్పారు. అవకాశాలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న దర్శనీయ దేవాలయాలు, ప్రదేశాలను సందర్శించి, పిల్లలకు మన సంస్కృతిని, సంప్రదాయాలను, వారసత్వ సంపదలను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, గుండా మనోహర్, చిత్తరంజన్ దాస్, రమేష్ గురూజీ, రఘు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.