9 July, 2026 | 2:11 AM

పాఠశాలకు తాళం వేసి..మరో బడిలో చేరిన టీచర్, విద్యార్థి!

09-07-2026 01:20 AM

మూత పడ్డ ఏక విద్యార్థి పాఠశాల 

మహబూబాబాద్, జూలై 8 (విజయక్రాంతి): పాఠశాలలో చదివే ఏకైక విద్యార్థితో పాటు అతనికి చదువు చెప్పే ఉపాధ్యాయుడు ఆ పాఠశాలకు తాళం వేసి మరో పాఠశాలలో చేరిపోయారు. దీనితో ఏక విద్యార్థి పాఠశాల మూతపడింది. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో చోటు చేసుకుంది. క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది నలుగురు విద్యార్థులు విద్యనభ్యసించగా, ఈ ఏడాది అందులో ముగ్గురు 5వ తరగతి పూర్తి చేసి, ఆరో చదివేందుకు ఇతర పాఠాలలు వెళ్లగా, 4వ తరగతి చదివే రితీష్ ఒకే ఒక్క విద్యార్థి విద్యనభ్యసించే పరిస్థితి నెలకొంది.

హెడ్మాస్టర్ కం టీచర్ శ్రీనివాస్ పాఠశాల ఆవాస ప్రాంతంలో ఉన్న కొందరు బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసి ఆ ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్ ఇవ్వాలని ఆదేశించడంతో, మండల విద్యాధికారి ఆదేశాలతో  2న క్యాంపు తండా ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఏకైక విద్యార్థి తో పాటు హెడ్మాస్టర్ కం టీచర్ శ్రీనివాసు పాఠశాలకు తాళం వేసి సమీప కల్వల ప్రాథమిక పాఠశాలలో చేరిపోయారు.

ఫలితంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పాఠశాల భవనం, మౌలిక వసతులు నిరుపయోగంగా మారిపోయాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక్క విద్యార్థి ఉన్నా పాఠశాలను నిర్వహించాల్సి ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలను మూసివేయడం పట్ల విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి. ప్రభుత్వ బడిని కాపాడుకోవా ల్సిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం కూడా బడి మూసివేతకు ఆదేశాలివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.