1 August, 2026 | 5:06 AM

గురువుల కల సాకారం!

23-06-2024 01:09 AM
  • తొమ్మిదేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర
  • తొలగిన చట్టపరమైన అడ్డంకులు
  • భాషా పండితులు, పీఈటీల రెండు దశాబ్దాల సమస్య పరిష్కారం
  • 18 వేల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం
  • 10,851 మంది టీచర్లకు ఇప్పటికే ప్రమోషన్లు
  • మరోవారంలో మల్టీజోన్ 8వేల మందికి అవకాశం

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడంతో ఉపాధ్యాయ వర్గం హర్షిస్తోంది. గత తొమ్మిదేళ్లుగా పదోన్నతులు పెండింగ్‌లో ఉండడంతో తన సర్వీస్‌లో కనీసం ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే ఎంతో మంది టీచర్లు మొన్నటి వరకు రిటైర్ అయ్యా రు. మరికొంత మందైతే ఐదేళ్లుగా బదిలీలు లేక అదే స్థానంలో విధులు నిర్వర్తిస్తూ సతమతమవుతున్న పరిస్థితి ఉండేది.

టీచర్లకు పదోన్నతులు, బదిలీ ప్రక్రియ చేపట్టాలంటే ఎన్నో కోర్టు కేసులు చిక్కులు తలెత్తేవి. దీంతో ముందుకు పోయే పరిస్థితి ఉండేది కాదు. విద్యాశాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించారు. న్యాయపరమైన చిక్కులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ  పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గురువుల కల ఎట్టకేలకు సాకారమవుతోంది.

ప్రమోషన్లకు ఎన్నో ఆటంకాలు

సంవత్సరాల తరబడి ఎదురు చూసిన పదోన్నతులు, బదిలీలను టీచర్లు పొందుతున్నారు. రెండు దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ) ఎదురుచూస్తున్న ప్రమోషన్ల కల ఎట్టకేలకు నెరవేరడంతో ఉపాధ్యాయ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రమోషన్లకు ఆటంకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న పలు చట్టపరమైన అడ్డంకులను పరిష్కరించడంతో ప్రమోషన్లకు మార్గం సుగమమైందని చెప్పాలి.

తమకు అన్యాయం జరిగిందనే భావనతో కొందరు ఉపాధ్యాయులు వేసిన కేసుతో ఏడాదిన్నర క్రితమే పొందాల్సిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇప్పటికి సాఫీగా సాగుతోంది. ఫలితంగా 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలు ప్రమోషన్లు పొందడంతో పాటు నూతన స్థానాల్లో పోస్టింగులు దక్కించుకున్నారు. మల్టీజోన్ 1, 2ల్లో కలిపి 10,851 మంది ఉపాధ్యాయులు ఇప్పటి వరకు ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్2లో మరో 8 వేల మందికి వారం రోజుల్లో ప్రమోషన్లు దక్కనున్నాయి.

పెద్దసంఖ్యలో..

గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు రాష్ర్ట ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది.  ఇంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పారదర్శకతతో పూర్తి చేసింది. భాషా పండితులు, పీఈటీలతో ఇతరులకు కలిపి మొత్తం 10,851 మంది ప్రమోషన్లు లభించాయి. ఈ నెలాఖరు (జూన్, 30) నాటికి మరో ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులకు  ప్రమోషన్లు కల్పించడంతో పాటు బదిలీలను అధికారులు పూర్తి చేయనున్నారు.

మల్టీజోన్ తరహాలోనే మల్టీజోన్ ప్రమోషన్లను కూడా ఎలాంటి చిక్కులు లేకుండా విజయవంతంగా చేపట్టాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల ఉత్వర్వులు సిద్ధం చేసినప్పటికీ కోర్టుల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ ఉత్తర్వులను అప్పట్లో జారీ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపడంతో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

ఫలితంగా చట్టపరమైన అడ్డంకులు అధిగమించి ప్రమోషన్లకు బాట పడింది. ఉపాధ్యాయుల అర్హతకు తగినట్లు ప్రమోషన్లు దక్కడంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగనుంది.