5 August, 2026 | 1:52 AM

29న టీచర్ల మహాధర్నా

05-08-2026 12:00 AM
  1. సెప్టెంబర్‌లో అసెంబ్లీ ముట్టడి
  2. ఈనెల 7న పాఠశాలల్లో నిరసనలు
  3.    12, 13న మండల కేంద్రాల్లో వినతులు
  4.    19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
  5. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన యూఎస్‌పీసీ
  6. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హెచ్చరిక

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సమరానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) సిద్ధమైంది. పాఠశాలల నుంచి రాజధాని వరకు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దశలవారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.

మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమ కార్యాచరణను యూఎస్‌పీసీ నాయకులు చావ రవి, ఎ.వెంకట్, సీహెచ్ అనిల్‌కుమార్, ఎన్.తిరుపతి, ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, బి.కొండయ్య, ఎస్.హరికిషన్, మేడి చరణ్‌దాస్ తదితరులు వెల్లడించారు. ఈనెల 7న పాఠశాలల్లో నిరసనలు, 12,13న మండల కేంద్రాల్లో వినతిపత్రాలు అందజేత, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

21 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర, జిల్లాల్లో తమ బృందాలు పర్యటిస్తూనే మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఆగస్టు 29న ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.  అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం  చేపడతామని హెచ్చరించారు. 

సీఎం గారూ.. టీచర్లతో పెట్టుకోవద్దన్నది మీరే కదా..  

ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పలు వేదికలపై చెప్పారని యూఎస్‌పీసీ నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయింపు హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు. పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించినట్లు ఘనంగా చెప్పుకుని, కేవలం యూకేజీకే పరిమితం చేశారని మండిపడ్డారు.

ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, ఈ సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవచూపాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో, రెవెన్యూ డివిజన్‌కు ఒక డిప్యూటీ ఈఓ, అన్ని మండలాలకు ఎంఈఒ పోస్టులు మంజూరు చేయాలన్నారు.