10 April, 2026 | 3:35 AM

తనిఖీలతో బోధన మెరుగు!

10-04-2026 01:47 AM
  1. ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైన కదలిక
  2. చదువులో మరింత నాణ్యత దిశగా అడుగులు

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): పాఠశాల విద్యలో నాణ్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించేందుకు 299 బృందాలను నియమించింది.

ఇప్పటిదాకా సుమారు 4,600 పాఠశాలల్లో తనిఖీలు జరిగాయి. వీటిలో 3,966 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 589 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉపాధ్యాయుల వివరాలు, సిలబస్ పూర్తి చేయడంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులు ఈ నివేదికల్లో క్రమం తప్పకుండా నమోదవుతున్నాయి. ఈ తనిఖీల ప్రభావం ఉపాధ్యాయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

బోధనలో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయుల్లో ఈ బృందాల పట్ల ఆందోళన పెరిగిందని చర్చ జరుగుతోంది. అదే సమయంలో, కొందరు ఉపాధ్యాయులు నివేదికల రూపకల్పన, పాఠశాల పరిపాలనా వ్యవహారాల పేరుతో పాఠ్యాంశాలు నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో వెనుకబడుతున్నట్లు తేలింది. బోధనలో లోపాల వల్ల విద్యార్థులు నాణ్యమైన చదువుకు దూరం కాకుండా చూడటమే ఈ బృందాల ప్రధాన లక్ష్యం. ఆకస్మిక తనిఖీలతో పాటు, ఇప్పటికే తనిఖీ చేసిన పాఠశాలలను మళ్లీ పర్యవేక్షించే బాధ్యత కూడా ఈ బృందాలకు అప్పగించారు.

తొలి తనిఖీ తర్వాత పాఠశాలలు మళ్లీ పాత పద్ధతులకు మళ్లకుండా నిరంతర పర్యవేక్షణను అధికారులు సాగిస్తున్నారు. అయితే, పాఠశాల తనిఖీలు అత్యధికంగా సంగారెడ్డి (811), సూర్యాపేట (442), ఆదిలాబాద్ (429), నాగర్‌కర్నూల్ (367) జిల్లాల్లో జరగ్గా పెద్దపల్లి, నిర్మల్, మెదక్, వికారాబాద్‌లో అసలు తనిఖీలే మొదలవ్వలేకపోవడం గమనార్హం.