తీస్రీబార్..మోదీ సర్కార్
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం
ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖ సమర్పించిన మోదీ
దేశానికి సేవలందించేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారు
ఎన్డీయే ప్రభుత్వానికి తిరుగు లేదు
దేశ చరిత్రలో విజయవంతమైన కూటమి ఎన్డీయే
కాంగ్రెస్‌కు పదేండ్లలో కలిపి మాకు ఇప్పుడొచ్చినన్ని సీట్లు రాలే
ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ
లోక్‌సభా పక్ష నేతగా మోదీని ఎన్నుకొన్న ఎన్డీయే ఎంపీలు
సమావేశానికి హాజరైన టీడీపీ, జేడీయూ అధినేతలు
ఎన్డీయే అంటే..
ఎన్ - న్యూ ఇండియా
డీ - డెవలప్ ఇండియా
ఏ - యాస్పిరేషన్ ఇండియా
న్యూఢిల్లీ, జూన్ 7: కేంద్రంలో ప్రభు త్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్డీయే నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి సంతృప్తికరంగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వుల్లో తెలిపింది. నరేంద్ర మోదీని ప్రధా నమంత్రిగా నియమిస్తున్నట్టు పేర్కొంది.
రాష్ట్రపతి ఉత్త ర్వులకు ముందు.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ముర్మును ఆమె నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను ఆమెకు సమర్పించారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.
దేశానికి మరిన్ని సేవలు అందించాలని ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పారు. గత పదేళ్లలో తాను గడించిన అనుభవాన్ని ఉపయోగించి పనిచేస్తామని వివరించారు. 18వ లోక్‌సభలో ఎక్కువ మంది యువతే ఎంపీలుగా ఎన్నికయ్యారని, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మాకు దేశమే ప్రధానం..
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్డీయే కూటమి అంతటి శక్తిమంతమైనది మరొకటి ఏర్పడలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్డీయేకు దేశమే ప్రధానమని, ఆ తర్వాతే రాజకీయాలని పేర్కొన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో బీజేపీ నూతన ఎంపీలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు మోదీని పార్లమెంటరీ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
ఆ తర్వాత ఎన్డీయే సమావేశంలో కూటమి నాయకుడిగా మోదీని బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. ఎన్డీయేలో ఏ నిర్ణయమైనా అందరి ఆమోదంతోనే తీసుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
మాకు ఒక్కసారి వచ్చినన్ని సీట్లు రాలే
విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మొత్తం సీట్లు కలిపినా బీజేపీకి ఈ ఒక్కసారి వచ్చినన్ని రాలేదని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల ఫలితాలు వచ్చినరోజు అంకెలు బాగానే ఉన్నాయి కదా అని నేను ఒకరిని అడిగిన. ఈవీఎంలు బతికే ఉన్నాయా? చనిపోయాయా? అని ప్రశ్నించాను. ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయేలా చేయాలని వీళ్లు (ప్రతిపక్షాలు) గట్టిగా నిర్ణయించుకొన్నారు. ఈవీఎంలను నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. కానీ జూన్ 4న సాయంత్రం వరకు వారంతా మౌనం దాల్చారు.
ఈవీఎంలు వారి నోళ్లు మూయించాయి. భారత ప్రజాస్వామ్య శక్తి, సౌందర్యం ఇదే’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఎప్పటికీ ఓడిపోదని నమ్మే ప్రజల చేతనే ఈ కూటమి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోబోతున్నదని నమ్మించే ప్రయత్నం చేశారని విపక్షాలపై మోదీ మండిపడ్డారు. ‘గతంలో ఎన్డీయే సర్కారు ఉండేది. ఇప్పుడు ఆ సర్కారు ఉన్నది. మేం ఎప్పటికీ ఓడిపోమని ఈ దేశ ప్రజలకు తెలుసు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. కానీ, ఈ విజయాన్ని ఇండియా కూటమి ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు’ అని విమర్శించారు. ఇండియా కూటమి గత శతాబ్దానికి చెందినదని, అందుకే వారు ఈవీఎంల వంటి ఆధునిక సాంకేతికతలను ఒప్పుకోవటం లేదని మండిపడ్డారు.
దేశంలోనే అతి పురాతనమైన పార్టీ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ 100 ఎంపీ సీట్లు గెలువలేకపోయిందని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని అత్యంత తక్కువకు తీసుకుపోవటమే ఎన్డీయే కూటమికి వచ్చే పదేండ్ల ఎజెండా’ అని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఎన్డీయేలో ఎన్ అంటే కొత్త భారత్ అని, డీ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని, ఏ అంటే ఆకాంక్ష భారత్ అని మోదీ వివరించారు. దక్షిణాదిలో ఎన్డీయే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు.
ఎన్డీయే పక్షాల వరుస భేటీలు
పాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఎన్డీయే కూటమి సమావేశం ప్రారంభానికి ముందు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ తదితర పార్టీల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్రపై అంతర్గత చర్చలు జరిపారు. ఎన్డీయే సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు, నితీశ్ ఇద్దరూ మోదీ పక్కనే కూర్చున్నారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్డీయే నేతగా మోదీ ఎన్నికైన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ ఇండ్లకు వెళ్లి ఆశీర్వాదం తీసుకొన్నారు.
పక్క చూపులు చూడొద్దు
రాజకీయ ప్రలోభాలకు లోనుకావద్దని ఎన్డీయే ఎంపీలకు మోదీ గట్టిగా చెప్పారు. ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘కొందరు మిమ్మల్ని కలిసి మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో నా సంతకంతో ఓ లిస్టు తయారు చేసినా చేస్తారు’ అన్నారు.
74 మంది మహిళా ఎంపీలు
18వ లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలు ఉండనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వీరు గెలుపొందారు. అయితే, 2019లో 17వ లోక్‌సభకు 78 మంది ఎన్నికయ్యారు. ఈసారి నలుగురు తగ్గారు. ఈ లెక్కన ప్రస్తుత లోక్‌సభలో మహిళలు 13.5 శాతం మాత్రమే. ఈసారి గెలుపొందిన ఎంపీల్లో 43 మంది తొలిసారి లోక్‌సభలో అగుడుపెడుతున్నారు.
చిరాగ్ పాశ్వాన్‌కు ఆత్మీయ ఆలింగనం
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకొన్నాయి. సమావేశం ప్రారంభం కాగానే, బీజేపీ ఎంపీలు ‘మోదీ.. మోదీ’ అని నినాదాలు చేస్తుండగా.. ప్రధాని మోదీ సభలోకి ప్రవేశించారు. వేదికపైకి రాగానే చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఆయనను నవ్వుతూ పలకరించి నమస్కారం చేశారు. ఈ సమయంలో నితీశ్‌కుమార్ అనూహ్యంగా మోదీ కాళ్లు మొక్కటానికి ప్రయత్నించారు.
వెంటనే స్పందించిన మోదీ.. నితీశ్‌ను అడ్డుకొని ఆలింగనం చేసుకొన్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించిన నితీశ్‌కుమార్.. ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు సభలో చప్పట్లు మార్మోగాయి. వేదికపై అందరూ కూర్చున్న తర్వాత లోక్‌జనశక్తి నేత చిరాగ్‌పాశ్వాన్ వచ్చి మోదీని పలకరించారు. పాశ్వాన్ తలచుట్టూ చేయివేసి ఆప్యాయంగా పలకరించిన మోదీ.. ఆయన తల నిమిరి ఆశీర్వదించారు.
దేశానికి అసలైన నేత మోదీ: చంద్రబాబు
భారత్‌కు అసలైన నాయకుడు ఇప్పుడే లభించారని, ఆయనే నరేంద్రమోదీ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్డీయే కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీకి ఒక విజన్ ఉన్నది. జీల్ ఉన్నది. ఆయన పనితనం అద్భుతంగా ఉంటుంది. తన విధానాలన్నీ నిజమైన విశ్వాసంతో అమలుచేస్తారు. నేడు ఇండియాకు సరైన సమయంలో, సరైన నేత లభించారు. ఆయనే నరేంద్రమోదీ’ అని పేర్కొన్నారు.
గతంలో కూడా దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయని, అయితే ఇటీవల కాలంలో మోదీ నాయకత్వంలో మరింత దూకుడుగా వ్యవహరించడం వల్లే దేశం రెండంకెల అభివృద్ధి నమోదు చేసుకోగలిగిందని కొనియాడారు. అంతర్జాతీ యంగా భారత్‌ను గౌరవ ప్రదంగా చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారని చెప్పారు.
మోదీ వెన్నంటే ఉంటాం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశం ఏ దేశానికీ తలొగ్గదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ముందుచూపు ఉన్న నాయకుల బాటలో నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు. మోదీ నేతృత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ మోదీ ఎంతో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మోదీ చేతలు, మాటలతో తమలో దేశ భక్తిని రగిల్చారని, దేశానికి సేవ చేయాలనే తపన కలిగించారని పేర్కొన్నారు. కాగా, సమావేశంలో ప్రసంగించిన మోదీ.. జనసేన అధినేతను ఆకాశానికెత్తేశారు. పవన్‌కల్యాణ్ తుఫాను వంటివారని ప్రశంసించారు.
మేమంతా మీ వెంటే: బీహార్ సీఎం నితీశ్ కుమార్
మోదీతో కలిసి పనిచేయటం ఎంతో గొప్పగా ఉంటుందని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నారు. ‘మనమంతా ఒక్కచోట చేరటం, మోదీతో కలిసి పనిచేయడం చాలా మంచి తరుణం. మీరు (మోదీ) ప్రధానిగా ఆదివారం ప్రమాణం చేయనున్నారు. దేశ అభివృద్ధి కోసం గతంలో ఇచ్చిన హామీలను మరోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. మాకు మాత్రం ఇప్పటినుంచే ప్రధాని.
మీరు ఎప్పుడు ప్రమాణం చేసినా మేమంతా మీ వెంటే ఉంటాం. మీ నాయకత్వంలోనే పనిచేస్తాం. కానీ త్వరగా ప్రమాణ స్వీకారం చేయండి. పూర్తి స్థాయిలో మా మద్దతు మీకే’ అని నితీశ్‌కుమార్ అన్నారు. ఈసారి ఒకటీ, అరా స్థానాలు దక్కించుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఆ మాత్రం కూడా పోటీపడలేరని నితీశ్‌కుమార్ ఎద్దేవా చేశారు. వారు దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అందరం కలిసి ముందుకు సాగితే.. అభివృద్ధి తథ్యమని పునరుద్ఘాటించారు. ఇది శుభపరి ణామమని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం మరింత పురోగతి సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
రేపు సాయంత్రం 6 గంటలకు ప్రమాణం
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించడంతో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కర్తవ్యపథ్‌లో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించినట్టు సమాచారం. మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కూడా ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.






