తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది
బీఆర్ఎస్ నేతలకు పొగరు తగ్గలే
సచివాలయం ముందు తాగుబోతులకు, దొంగలకు స్థానం లేదు
హైదరాబాద్: సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ సర్కిల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 1980వ దశకంలో టెక్నాలజీని దేశానికి పరిచయం చేసిన దార్శనికుడు రాజీవ్‌గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ మరింత బలోపేతం చేయబడిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు సాధికారత కల్పించేందుకు రాజీవ్ గాంధీ కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
స్థానికసంస్థల ఎన్నికల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. సమూల మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేర్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా పొగరు తగ్గలేదని సీఎం ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తోందని హెచ్చరించారు. సచివాలయం ముందు తాగుబోతులకు, దొంగలకు స్థానం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, సీహెచ్. ఈ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






