23-10-2025 12:19:55 PM
చిట్యాల,(విజయక్రాంతి): వర్షాల కారణంగా పత్తిని నిల్వ పెట్టుకోలేక తెలంగాణ రైతులు సతమతం అవుతున్నారని గురువారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former MLA of Nakrekal Chirumarthi Lingaiah) అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో పత్తి చేనులను సందర్శించి, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పత్తి సీజన్ వచ్చిన రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి..? అని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పత్తిని స్టాక్ పెట్టుకోలేక తెలంగాణ రైతులు సతమతం అవుతున్నారని, దళారుల చేతుల్లోకి రైతులను నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం దళారులను ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు లాభం కలిగే విధంగా పంటలకు సరైన మద్దతు ధర ఇచ్చి, సమయానుకూలంగా కొనుగోలు చర్యలు చేపట్టేవారమని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టి రైతులను బాధలు పెడుతోందని అన్నారు. తెలంగాణ నుండి ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్ప మీరు ఇంత వరకు ఏం చేశారో చెప్పాలి...? అని అన్నారు.
రైతు సంక్షేమం జాడలేదని, వడ్ల బోనస్ ఊసులేదని, పండిన పంటను కొనుగోలు చేసే దిక్కే లేదని, ఒక్కనాడైనా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోలేదని, సకాలంలో ఎరువులు ఇవ్వడం చేతకాదని, పండించిన పంటను కొనుగోలు సోయి లేదని, మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.