1 June, 2026 | 5:09 PM

సింగరేణిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

01-06-2026 04:30 PM

ముఖ్య అతిధిగా డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐ‌ఏ‌ఎస్

 గోడ పత్రికను ఆవిష్కరించిన కవితా నాయుడు

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో, కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో జూన్ 2 వ తేదీన అత్యంత  ఘనంగా జరిగే  12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబురాలలో  ప్రముఖ సినీ, టీవి కళాకారుల ప్రదర్శనల గురించి తెలిపే  గోడపత్రికను సోమవారము రోజున ,జనరల్ మేనేజర్(పర్సనల్) ఐ‌ఆర్ & పి‌ఎం కవితా నాయుడు  ఆవిష్కరించారు. ఈ సంధర్భముగా  కవితా నాయుడు  మాట్లాడుతూ... 137 సంవత్సరాల ఘన చరిత్ర గల సింగరేణి సంస్థ జూన్ 2వ తేదీన 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకముగా కోల్ బెల్ట్ లోని అన్ని ఏరియాలలో నిర్వస్తున్నామని, అందులో భాగముగా కొర్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు వైభవముగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 

ఈ వేడుకలకు సింగరేణి సంస్థ సి&ఎం‌డి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐ‌ఏ‌ఎస్  ముఖ్య అతిధి గా పాల్గొంటారని, ఉదయం 7.30 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయము నందు జాతీయ జెండా ఆవిష్కరించి  ,అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రకాశం స్టేడియం నుండి కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ,తెలంగాణ రన్ నిర్వహించి , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో అమరులైన తెలంగాణ వీరులకు నివాళులు అర్పించటం జరుగుతుందని అన్నారు. అనంతరం  సి&ఎం‌డి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఉదయం 9.15 నిమిషాలకు ప్రకాశం స్టేడియం నందు పతాక ఆవిష్కరణ చేసి, తదుపరి ఎస్&పి‌సి, స్కౌట్స్ & గైడ్స్ చే గౌరవ వందనం స్వీకరించి సందేశం ఇస్తారని,  ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం, సాంస్కృతిక  కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 

సాయంత్రం 6 గంటలకు ప్రకాశం స్టేడియం నుండి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి  అమరులైన, తెలంగాణ వీరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. ఇక  సాయంత్రం 7 గంటల నుండి ప్రకాశం స్టేడియం నందు ,సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని,  ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి శ్రీమతి సీతాప్రసాద్ బృందంచే క్లాసికల్ డాన్స్, ప్రముఖ సినీ గాయనీ గాయకులు సాయి చరణ్, సత్యభామ స్వాతి, నజీరుద్దీన్, రజని టీంచే గొప్ప సినీ మ్యూజికల్ నైట్, ఈటీవీ  జబర్దస్త్ ఫేమ్ సద్దాం, బిందాస్ భాస్కర్, పులి టీమ్ చే అధ్బుతమైన కామెడీ  ,బుల్లితెర యాంకర్ జోర్ధార్ వెన్నెల  పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని సింగరేణీయులు , పట్టణ పరిసరప్రాంత ప్రజలు తిలకించి విజయవంతం చేయగలరని ,జనరల్ మేనేజర్(పర్సనల్) ఐ‌ఆర్ & పి‌ఎం కవితా నాయుడు  విజ్ఞప్తి చేశారు.