2 June, 2026 | 9:30 PM

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహణ

02-06-2026 08:22 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అశ్వాపురం మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అశ్వాపురం మండలం పార్టీ నాయకులు పాల్గొని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర సాధనలో వారి సేవలను కొనియాడారు. మరోవైపు రామచంద్రాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎండి ఆరిఫ్ జెండా ఎగురవేశారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యత, అమరవీరుల త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధిపై విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మొండికుంట గ్రామపంచాయతీలో సర్పంచ్ మర్రి సంధ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.