తెలంగాణలో ప్రజాపాలన కాదు.. రెడ్ల పాలన
l ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో మాదిగలు, బీసీలకు అన్యాయం
l ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీఎం అయ్యే అర్హత లేదా..?
l రేవంత్‌రెడ్డి తీరుతో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి
l ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, ఏప్రిల్ 24( విజయక్రాంతి ): తెలంగాణలో ప్రజాపాలన కాదు.. రెడ్ల పాలన నడుస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండి పడ్డారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన రెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆయన ఇదే విధంగా ముందుకెళితే మున్ముందు కాంగ్రెస్ కనుమరగయ్యే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు.
రేవంత్‌రెడ్డికి తన సొంత కులంపై అభిమానం ఉండొచ్చని, కానీ కులతత్వం తగదన్నారు. పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని మరిచిపోయి, ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి టికెట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టినట్లుగానే, ఇప్పు డు రేవంత్‌రెడ్డి సామాజిక అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయడం లేదన్నారు. మాదిగలకు సీటు ఇవ్వాల్సిన చోట, మాల సామాజికవర్గానికి సీటు ఇచ్చారన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క సీఎం పదవికి అర్హులు కాదా..? అని ఆయన నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టారని విమర్శించారు. ఓసీల్లో మిగతా కులాలైన బ్రాహ్మణ, వైశ్య, వెలమలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు నామినే షన్‌కు ఒకరోజు గడువు వరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదంటున్న కాంగ్రెస్, అదే ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గా ల్లో పోటీ ఎక్కుగా ఉన్నప్పటికీ ఏకాభిప్రాయ ం ఎలా వచ్చిందని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.






