లిక్కర్ స్కాం పక్కా ప్లాన్
ప్రణాళికతో చేసిన కుట్ర కల్వకుంట్ల కవితే 10 ఫోన్లనుఫార్మాట్ చేశారు
ఇది సాధారణ కేసు కాదు ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం
కోర్టులో ఈడీ వాదనలు తీర్పును మే 6కు రిజర్వ్
హైదరాబాద్,ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఢిల్లీ మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రయ.. అన్నీ కల్వకుంట్ల కవితేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఆమె సూచనల మేరకే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించిందని తెలిపింది. కుంభకోణం బయటపడగానే కవిత సాక్షాలన్నింటినీ ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని, వారిని అనుమానిస్తే కోర్టును అవమానించినట్టేనని స్పష్టంచేశారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కవితే సూత్రధారి, పాత్రధారి అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. రాజకీయ కోణంలోనే అప్రూవర్లపై ఆరోపణలు చేస్తున్నారని, ఎలక్ట్రోరల్ బాండ్లకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.
సాక్షులను బెదిరించిన కవిత
ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని కవిత బెదిరించారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదించారు. కవిత బినామీనని మొదట ఒప్పుకొన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లు, ఆమె ఒత్తిడితోనే యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య అవగాహన ఉందని బుచ్చిబాబు వాగ్మూలం ఇచ్చారని, కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కవితను కలిశారని, అప్పుడు కేజ్రీవాల్ రూ.100 కోట్లు అడుగుతున్నారని ఆయనకు కవిత చెప్పారని, రూ.50 కోట్లు ముందుగా ఇవ్వాలని కోరారని వివరించారు. తద్వారా కవితకు 33 శాతం వాటా కోసం వాటా కోసం బుచ్చిబాబు పనిచేసినట్లు ఆరోపించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ చాట్స్‌లో సాక్ష్యాధారాలు దొరినట్లు వెల్లడించారు. మాగుంట రాఘవ తన సిబ్బంది గోపీకుమార్‌తో రెండు విడతలుగా రూ.25 కోట్లను బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి ఇచ్చినట్లు తెలిపారు.
-ఇండో స్పిరిట్ ఉద్యోగిగా మేక శరణ్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత మేనల్లుడు మేక శరణ్‌ను హైదరాబాద్‌లో విచారించామని జోహెబ్ హుస్సేన్ తెలిపారు. విచారణకు రావాలని ఆయన్ని కోరితే ఎనిమిదిరోజులు తప్పించుకుని తిరిగాడని, చివరికి విచారించి పలు విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. శరణ్‌ను ఇండో స్పిరిట్ ఉద్యోగిగా పెట్టారని, కానీ ఆయన ఏ రోజూ ఉద్యోగానికి హాజరు కాలేదని.. అయినా నెలకు రూ.లక్ష జీతం చెల్లించారని వెల్లడించారు. అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అమాయకుడు కాదని, ఈ వ్యాపారంలో ఆయన ప్రధాన లబ్ధిదారుడని స్పష్టం చేశారు. ఈ పాలసీ రూపకల్పనతో ఆయన ఐదు రిటైల్ జోన్లు పొందారని పేర్కొన్నారు. ఇంతలోనే కవిత తరఫున న్యాయవాది నితేష్ రాణా కలుగజేసుకుని, బుచ్చిబాబు లైజెనింగ్ చేస్తే, ఆయనను ఎందుకు ఈడీ అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
అయితే, బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిందని, ఈడీ అరెస్టు చేయలేదని జోహెబ్ హుస్సేన్ తెలిపారు. కేసు విచారణ కొనసాగుతున్నందున ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని జోహెబ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘కవిత ఉద్దేశ పూర్వకంగానే ఫోన్లలో డాటాను డిలీట్ చేశారు. ఈడీకి 10 ఫోన్లు ఇచ్చేటప్పుడు అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారు. పని మనుషులకు ఇచ్చానని, వారు అన్నీ డిలీట్ చేశానని చెబుతున్నారు. కానీ పని మనుషులకు ఫోన్లు ఇస్తే వారెందుకు డాటాను డిలీట్ చేస్తారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఫైనల్ ఆర్గ్యుమెంట్ కాదని, బెయిల్ పిటిషన్‌పై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. తమ వాదనలను లిఖితపూర్వకంగా రీజాయిండర్ రూపంలో దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 6వ తేదీకి రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయమూర్తి కావేరి భవేజా వెల్లడించారు.






