తెలంగాణ బలం బీఆరెస్సే
నా యాత్రకు భయపడే రైతుభరోసా ఇచ్చారు
రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడేది మనమే
ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై పోరు
హామీలు అమలుచేసేలా ఒత్తిడి తెద్దాం
అచ్చే దిన్ అన్న మోదీ సచ్చే దిన్ తెచ్చారు
ఆదాయం ఏమోగానీ రైతుల ఖర్చులు పెంచారు
నిజామాబాద్ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నిజామాబాద్, మే 6 (విజయక్రాంతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా బలం, బలగం భారత రాష్ట్ర సమతి (బీఆర్‌ఎస్) పార్టీయేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటేనని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ నగరం వరకు బస్సు యాత్ర నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రజలకు అభివాదం చేశారు. నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన కార్నర్ మీంటింగ్‌లో ప్రసంగించారు. నిజామాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇన్ని రోజులు రైతుబంధుపై మిన్నకుండిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రచార రథం ఎక్కగానే వణుకు పుట్టి రైతులకు రైతుబంధు వేసిందని అన్నారు.
అచ్చేదిన్ అని సచ్చే దిన్ తెచ్చారు
ప్రధాని నరేంద్రమోదీ అచ్చేదిన్ అని చెప్పి ప్రజలు సచ్చే దిన్ తెచ్చారని కేసీఆర్ విమర్శించారు. ‘ఓట్ల కోసం మోదీ ప్రభుత్వం పదేండ్లలో ౧౫౦ నినాదాలిచ్చింది. అందులో ఒక్కటైనా అమలు చేశారా? అచ్చేదిన్ లాయింగే, సబ్ కా సాత్ సబ్‌కా వికాస్, బేటీ పడావో బేటీ బచావో అన్నారు. అచ్చేదిన్ ఏమోకానీ రైతులు సచ్చేదిన్ వచ్చింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి ఖర్చులు రెట్టింపు చేశారు. కాంగ్రెస్
హామీలు కూడా ఒక్కటీ అమలు కాలేదు. రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా?’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలిచ్చిన మోదీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్కటికూడా ఇవ్వలేదని, జిల్లాకు ఒక నవోదయ స్కూలు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టిం చుకోలేదని విమర్శించారు. అలాంటి మోదీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లేస్తారని ప్రశ్నించారు. బీజేపీ మాయలో తెలంగాణ ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పాలనలో కల్లోలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే డిసెంబర్ 9న కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. విద్యార్థులకు ఫీజు రీఇం బర్స్‌మెంట్లు లేవు. కేసీఆర్ కిట్ ఆపేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడంలేదు. చేనేత కార్మికులక పనిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటూ కేసీఆర్‌ను తిట్లు తిడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందని, ఆ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు రూ.౨ లక్షల రుణమాఫీ రావాలంటే బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ బలహీనపడిందని, అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణలో 14 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో మళ్లీ నిర్ణాయాత్మక శక్తిగా మారుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి రూ౧౨ వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ముస్లింలు కాంగ్రెస్, బీజేపీ మాయలో పడకుండా బీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. తాను మోదీని వ్యతిరేకించాను కాబట్టే తన కూతురు కవితను ఆరెస్ట్ చేయించాడని, ఐనా మోదీకి లొంగేది లేదని స్పష్టంచేశారు. సభలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ బస్సు తనిఖీ
జగిత్యాల, మే 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి నిజామాబాద్ రోడ్ షోకు వెళ్తుండగా, జగిత్యాల మండలంలోని చల్‌గల్ వద్ద జాతీయ రహదారిపై బస్సును ఆపి తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌టీ జగిత్యాల ఇన్‌చార్జి విజేందర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.
గురువును పరామర్శించిన కేసీఆర్..
సిద్దిపేటలో ఇంటర్ చదివే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ బోధించిన గురువు జైశెట్టి రమణయ్యను కేసీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతసురేష్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




