09-12-2025 05:02:08 PM
జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి..
వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఐడిఓసి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఐడిఓసిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం జిల్లా ప్రజలకు స్పూర్తినింపేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, విలువలను చేరవేయడానికి ఈ విగ్రహం ఉపయోగపడుతుందని తెలిపారు. ఐడిఓసి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 12 అడుగులు ఉండగా, దిమ్మే ఎత్తు ఆరు అడుగులు, మొత్తంగా 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.