రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం
భిక్కనూర్, జూన్ 30 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్V, VI ఆధ్వర్యంలో వారం రోజుల ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ చేపూరి రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. రామేశ్వరపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. వారం రోజుల పాటు గ్రామ సమస్యలపై అధ్యయనం చేసి పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణం, డిజిటల్ అవగాహన వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు తెలిపారు. అనంతరం విద్యార్థులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.






