1 July, 2026 | 12:56 AM

కాంగ్రెస్ ప్రజాపాలనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ప్రచారం తగదు

01-07-2026 12:00 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక కార్యదర్శి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సతీష్ మాదిగ

ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ లో దొరల కాళ్ల కింద నలిగిపోతూ వాళ్లు చెప్పినట్లుగా ఆడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రజా పాలన మీద తప్పుడు ప్రచారం చేస్తూ తన ఉనికి కోసం తాపత్రయ పడుతున్నాడని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం గురుకులాల టెండర్లు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణం చేసిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ హరీష్ రావుకు కొప్పుల ఈశ్వర్ కు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలుస్తుండని విమర్శించారు. మంత్రులు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ లను అవమానకరంగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతూ తన స్థాయిని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు.

నిజానికి ఈయన గురుకులాల్లోకి వచ్చిన తర్వాత గురుకులాలు కొంత మెరుగుపడ్డ మాట వాస్తవం అని సతీష్ మాదిగ అన్నారు. ఈ ప్రొకూర్మెంట్ పోర్టల్ ద్వారా జాతీయ టెండర్ విధానం నియమ నిబంధనల ప్రకారం టెండర్స్ కేటాయించారని తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 3 వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తం టెండర్ 600 కోట్లు అయితే 3 వేల కోట్లు అవినీతి ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు.

తెల్లనాగు హరీష్ రావు, 2 వేల కోట్లు కుంభ కోణం అని, తన నియోజకవర్గమైన ధర్మపురికి ఒక్క కాలేజీ కూడా తీసుకురాని చేతగాని దద్దమ్మ కొప్పుల ఈశ్వర్ సవాల్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. జూలై 2 న ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు, లేక తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికైనా తెల్లనాగు హరీష్ రావు వస్తే మా మంత్రులు వస్తారని,  ఒకవేళ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే తాను టెండర్స్ పత్రాలతో వచ్చి సమాధానం చెబుతానని సతీష్ మాదిగ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మానవతా రాయ్, డాక్టర్ లింగం యాదవ్, మేడ రవిచంద్ర, కాపు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.