18 April, 2026 | 1:33 AM

గాలికిపోయిన తెలంగాణ పాలన

18-04-2026 12:02 AM
  1. వెంటనే ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు 

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సచివాలయ ఉద్యోగులకు శాపం.. ఆర్టీసీ కార్మికులకు ద్రోహం.. రేవంత్ రెడ్డికి మాత్రం పబ్లిసిటీ వ్యామో హమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణ పాలన గాలికిపోయిందని, కాంగ్రెస్ అరాచకంలో సామాన్య ప్రజలు, కార్మికులు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్రం లో నెలకొన్న తాజా పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయని, ప్రజాసమస్యలు పరిష్కరించే సెక్రటేరియట్‌లోనే ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. పీఆర్సీ అమలు లేదు, పెండింగ్ డీఏలు రావు, హెల్త్ కార్డులు పనిచేయవు, చివరకు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టిన ఓపీఎస్ హామీని కూడా గాలికొదిలేశారని, సచివాలయ ఉద్యోగులకే దిక్కులేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.

ఈ నెల 22 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని, ఉద్యోగ, కార్మిక వర్గాల హక్కుల సాధన కోసం బీజేపీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులల డిమాండ్లను పరిష్కరించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.