20-01-2026 01:28:03 AM
నరేశ్ వీకే ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘శుభకృత్ నామ సంవత్సరం’. ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో నరేశ్ వీకే మాట్లాడుతూ.. “రామోజీ, జంధ్యాల నాకు ఒక ఫ్యామిలీ. తర్వాత శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు మరో ఫ్యామిలీ లాగా వచ్చారు. శ్రీవిష్ణు మై హీరో. మహేశ్ తర్వాత అంత మంచి షటిల్‌గా ఉండే టైమింగ్ తనలో చూశా. ‘శుభకృత్ నామ సంవత్సరం’ అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. తెలుగు, కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఈ సినిమా రెండు భాషల్లో చాలా మంచి పేరు తీసుకొస్తుంది.
ప్రతి సంవత్సరం మన తెలుగు సినిమా కళకళలాడాలి” అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఏ పాత్ర అయినా అద్భుతంగా చేయగల నరేశ్ మన తెలుగు పరిశ్రమంలో ఉండడం చాలా గర్విస్తున్నా. ‘సామజవరగమన’ నాకు, నరేశ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఒక గొప్ప కథ వచ్చినప్పుడు మళ్లీ ఆయన చేయాలని ఎదురుచూశా. అలాంటి సినిమా మా కాంబోలో చూడబోతున్నారు” అని చెప్పారు. పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ.. “నరేశ్ ఒక కింగ్‌లాగా బతుకుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనేది ఆయన ఫిలాసఫీ. ఈ గ్లింప్స్ చూస్తే ఆ పాత్రలో నరేశ్ కనిపించారు” అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్లు రామ్ అబ్బరాజు, సజ్జన్, నిర్మాతలు రాజేశ్ దండా, విశ్వనాథ్ నాయక్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడారు. మూవీ యూనిట్ పాల్గొన్నారు.