తెలుగు తల్లి ఫ్లుఓవర్‌కు తెలంగాణ తల్లి పేరు పెట్టాలి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లు ఓవర్‌కు తెలంగాణ తల్లి ఫ్లుఓవర్‌గా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించాలని కోరారు.
భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరెవరూ మార్చకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, కలెక్టరేట్లలోనూ తెలంగాణ తల్లి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విగ్రహంలో రాష్ట్ర సంస్కృతి దాగి ఉన్నదని తెలిపారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం చాలా బాగుందని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ విగ్రహాన్ని తీయకుండా చూడాలని, సూచించారు.
రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి విగ్రహానికి చట్టబద్ధత చేయడం హర్షించదగ్గ విషయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతికి దర్పణమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.






