27-06-2025 01:06:46 AM
ఎండోమెంట్ ఏసీకి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి
మేడ్చల్, జూన్ 26(విజయ క్రాంతి): మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని స్వచ్ఛంద సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. 91 సర్వే నంబర్ లో ఎకరం 10 గుంటలు శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయానికి చెందినదని, ఈ భూమి ఆక్రమణకు గురికాగా స్థానికులు అనేక ఏళ్లుగా న్యాయపోరాటం చేశారని తెలిపారు.
న్యాయస్థానంలో దేవాలయానికి అనుకూలంగా తీర్పు రావడంతో దేవాదాయ శాఖ వారు భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దీర్ఘకాలిక లీజును వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా స్థానికులు పోరాటం చేసి కబ్జా నుంచి విముక్తి చేసిన విలువైన స్థలం మళ్ళీ కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఆషాడ మాస బోనాల పండుగకు మల్కాజ్గిరి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టిఆర్‌ఎస్ నాయకులు ధోలి రమేష్, సురేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పవన్, రేవంత్ రెడ్డి, రాజు, తదితరులు ఉన్నారు.
స్థానికుల ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే
మచ్చ బొల్లారంలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయానికి చెందిన భూమి లీజుకు ఇస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన ఆబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.