10 June, 2026 | 1:01 AM

కౌలు రైతు ఆత్మహత్య

10-06-2026 12:00 AM

జగిత్యాల, జూన్ 9 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని మానాల పెద్ద దుబ్బయ్య (60) అనే కౌలు రైతు ఆత్మ హత్య చేసుకొని బలవన్మరణం చెందారు. కుటుంబీకులు, బుగ్గారం ఎస్త్స్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మానాల పెద్ద దుబ్బయ్య అనే దళిత రైతు వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తుంటారు.

బుగ్గారం గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, పంట దిగుబడి కూడా తగ్గి పోయి అప్పుల పాలయ్యాడు. అప్పటికే అప్పుల బాధలతో సతమతం అవుతున్న ఆయన ఈ ఏడాది వరి పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని, పంట పెట్టుబడి బాకీలు, భూ యజమానులకు కౌలు డబ్బులు కూడా ముట్టే పరిస్థితి లేదని బెంగ పెట్టుకున్నారు.   

సోమవారం మధ్యాహ్నం జగిత్యాలకు పోయి వస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పి ఇంటి నుండి బయలు దేరి రాత్రి వరకు కూడా ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబీకులు ఎంత వెతికినా ఫలితం లభించలేదు. మంగళ వారం ఉదయం బుగ్గారం శివారు, చందయ్యపల్లి రోడ్డులో అతను కౌలుకు చేసిన పంట పొలాల సమీపంలోనే విగత జీవిగా శవమై కనిపించాడు. వెంటనే బుగ్గారం పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడి కుమారుడు మానాల లక్ష్మి నారాయణ పిర్యాదు మేరకు వ్యవసాయం ద్వారా వచ్చిన నష్టాలతో అప్పులు పేరుకుపోయాయని, మనస్థాపం చెంది మాకు ఎవరికీ చెప్పకుండా  కౌలు చేసిన పొలాల వద్దకు వచ్చి గుర్తు తెలియని విష పదార్థాలను సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పిర్యాదు చేశారని ఎస్త్స్ర తెలిపారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్త్స్ర జి.సతీష్ తెలిపారు.