10 June, 2026 | 12:44 AM

ఫీజులు ఎట్లా కట్టుడు?

10-06-2026 12:00 AM
  1.   15న పాఠశాలల పునఃప్రారంభం
  2. ‘ప్రైవేట్’లో ఫీజుల మోత
  3. అప్పుల పాలవుతున్న కుటుంబాలు

కరీంనర్, జుస్ 9 (విజయక్రాంతి): వేసవి సెలవులతో మూగబోయిన బడిగంట మోగనుంది. ఈ నెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇన్ని రోజులు వేసవి సెలవుల్లో ఆటలు పాటలతో గడిపిన విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ తో, భుజాన బ్యాగుతో పాఠశాలలకు వెళ్ళనున్నారు. పాఠశాలల ప్రారంభ తేదీ  దగ్గర పడుతూండటంతో  పేద, మధ్య తరగతి కుటుంబాల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. 

ఈ నెలలోనే వంట గ్యాస్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు పెరగడం మోయలేని భారంగా మారింది. పాఠశాలలతో పాటు కళాశాలలు ఆరంభం కావడం, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టనుండడంతో కావాల్సిన ఫీజులు, పెట్టుబడుల కోసం నానా తంటాలు పడుతున్నారు.  తమకు వచ్చే డబ్బుల కోసం ఎదురు చూడకుండా కొందరు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవడంతో పాటు మరికొందరు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.

వేసవి సెలవులు ముగిసిన తర్వాత  ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆరంభం కానుండగా, మొదటి వారంలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు ఇతరత్రా వృత్తి విద్యా కళాశాలలు కూడా ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. పిల్లలకు మంచి చదువులు చదివించాలనే తాపత్రయం చాలా మంది తల్లిదండ్రుల్లో ఏర్పడింది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం అందే అవకాశాలున్నప్పటికీ, ఒకరిని చూసి మరొకరు మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివించేందుకు ఆరాట పడుతున్నారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. తమ వద్ద డబ్బులు లేకున్నా కూడా అప్పులు తీసుకవచ్చి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి.

అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండడంతోపాటు అదనపు ఫీజుల పేరిట దోపిడీ సాగిస్తున్నాయి. అంతేగాకుండా యూనిఫారాలు, టైలు, బెల్టులు, షూస్ దగ్గర నుంచి మొదలుకుని పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కుల వరకు విద్యా సంస్థల్లోనే విక్ర యిస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల మీద తీరని భారం పడుతున్నది. ఫీజులను రెండు, మూడు విడతల్లో చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఒకేసారి చెల్లిస్తే, మొత్తం ఫీజులో 5 నుంచి 15 శాతం వరకు రాయితీలు ఇస్తుండడంతో కొందరు మొత్తం చెల్లిస్తున్నారు. డబ్బులు లేని వాళ్లు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ సమకూర్చుకుంటున్నారు.

ఔట్ ఆఫ్ కవరేజీ ఏరియా..

అడ్మిషన్లు ప్రారంభం కావడంతో తమ పిల్లలకు ఫీజు తగ్గించండి అంటూ చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు  చేస్తున్నారు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు ఫోన్ లో  అందుబాటులో ఉండకుండా పోతుండటంతో తల్లిదండ్రులు బేజారవుతున్నారు. కొందరు అందుబాటులోకి వచ్చి తగ్గిస్తాం సార్ అని 5 వేలకు మించి తగ్గించడం లేదు. ఫీజుల పై నియంత్రణ లేకపోవడంతో అడ్డు అదుపు లేని ఫీజులతో సామాన్య, మధ్య తరగతి వారు బేజారు అవుతున్నారు

నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు..

పేరుకే విద్యాశాఖ ప్రకటనలు.. యధావిధిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యా వ్యాపారం సాగుతుంది. విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు.  జీవో నెంబర్ 1 ను పూర్తిగా విస్మరించి ప్రైవేట్ కార్పొరేటర్ పాఠశాలలు ధనాచనే ధ్యేయంగా డి .ఎఫ్. ఆర్. సి అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ఫీజులు లక్షల్లో పెంచి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు పీజీ దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తి వైఫల్యం చెందారని ఆయన ఆరోపించారు.

 దొగ్గలి శ్రీధర్, 

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి