14-11-2025 12:02:13 AM
భీమదేవరపల్లి నవంబర్ 13 ( విజయక్రాంతి) కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు నాణ్యమైన దేవుని ప్రసాదాన్ని టెండర్ ద్వారా అందించాలని మాజీ ధర్మకర్తలు, గ్రామస్తులు కోరడం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే గుమ్మడికాయ, కొబ్బరికాయ, కోర మీసాలు, కొబ్బరి ముక్కల సేకరణ, పార్కింగ్ సేవలకు గాను ఈనెల 11న వేలం పాటలను నిర్వహించారు.
2026కు సంబంధించి నిర్వహించిన వేలం పాటలో దేవాలయానికి గత ఏడాది కన్నా ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ ఉంటారు. భక్తులకు ఆలయంలో అందించే ప్రసాదాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా అందించకపోవడంతో ఆలయ ఆదాయం తగ్గిపోతుందని మాజీ ధర్మకర్తలు, గ్రామస్తులు ఇటీవల జరిగిన వేలం పాటలు నిర్వహించిన సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారితో వాగ్వాదానికి దిగడం జరిగింది.
దేవాలయా అభివృద్ధి కమిటీ లేకపోవడంతో కొంతమంది ఇష్టానుసారంగా వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని మాజీ ధర్మకర్త ఒకరు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ఆలయ అభివృద్ధి కమిటీని నియమించి సమూలమైన మార్పును తీసుకురావాలని గ్రామస్తులు కోరడం జరిగింది. కాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నియామాలకు అనుగుణంగానే ప్రతి సంవత్సరం లడ్డు పులిహోర ను ఆలయ అర్చకులకు ఇవ్వడం జరుగుతుందని కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు వెల్లడించారు.