ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్!
పెరిగిన ఓటింగ్ శాతంతో ఏం జరుగుతుందోనని ఆందోళ
గెలుపోటములపై క్యాడర్‌తో సమాలోచనలు
పోలింగ్ సరళిని బట్టి లెక్కలు వేసుకుంటున్న క్యాండిడేట్లు
బూత్‌లవారీగా రిపోర్టులు తెప్పించుకుంటున్న పార్టీలు
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే వీరి భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో అప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు అగ్నిపరీక్షే అని చెప్పాలి.
గెలుస్తామా.. ఓడుతామా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అని అభ్యర్థుల్లో టెన్షన్ కనబడుతోంది. ఎన్నికల ముందు తామే గెలుస్తామని ధీమాలో ఉన్న అభ్యర్థుల్లో పోలింగ్ ముగిశాక ఒకింత ఆందోళన కనిపిస్తోంది. అప్పటి జోష్ కనబడట్లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటే, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇంకొన్ని చోట్ల మూడు పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రాష్ట్రంలో ఓటింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 66.4 శాతం పోలింగ్ జరిగితే ఈసారి దాదాపు 70 శాతం వరకు నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహిళలు, వృద్ధులు, యువత భారీగా ఓటింగ్‌లో పాల్గొనడంతో గెలుపు ఓటములపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ కనబడుతోంది. పోలింగ్ సరళిని బట్టి అనుచరులతో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తమకు పోలైన ఓట్లు, ప్రత్యర్థులకు పోలైన ఓట్లను బేరీజు వేసుకుంటూ లెక్కలు కడుతున్నారు. గెలుపునకు దగ్గరలో ఉన్నామా? లేదా? అని క్యాడర్‌తో సమాలోచనలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఓట్లలో మనకెన్ని? ప్రత్యర్థికెన్ని ఓట్లు పోలయ్యాయోనని పోలింగ్ బూతులు, నియోజకవర్గాలవారీగా నివేదికలు తెప్పించుకునే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి.
గెలుపు నిర్ణేతలు వీరేనా!...
రాష్ట్రంలో దాదాపు 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.65 కోట్ల మంది ఉంటే, మహిళలు 1.67 కోట్ల మంది, ఇతరులు 2,557 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న వారు 9.20 లక్షలు కాగా, 20 ఉన్న వారు 67 లక్షల మంది, 30 ఉన్నవారు 91 లక్షల మంది ఉన్నారు. అయితే అభ్యర్థుల గెలుపోటములు వీరిచేతిలోనే ఉన్నాయని చెప్పవచ్చు. పార్టీలు కూడా ఇలానే భావిస్తున్నాయి. మహిళలు, నిరుద్యోగులు, యువత ఓట్లలో తమకు ఎంత శాతం పడ్డాయి? అని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆరా తీస్తున్నారు.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 41.7 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) 9 స్థానాలను కైవసం చేసుకుంటే, 19.7 శాతం ఓట్లొచ్చిన బీజేపీకి 4 స్థానాలు, 29.8 శాతం ఓట్లొచ్చిన కాంగ్రెస్‌కు మాత్రం 3 సీట్లే వచ్చాయి. కేవలం 2.8 శాతం ఓట్లు వచ్చిన ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. ఈ సారి ఓటింగ్ శాతం పెరగడంతో ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.




