కరీంనగర్‌లో ఉద్రిక్తత
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆందోళన
కలెక్టరేట్ ముట్టడికి యత్నం
పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట, అరెస్ట్
కరీంనగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెండింగులో ఉన్న బకాయిలను, మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు పలువురు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఇవ్వకుండా విద్యార్థుల చదువును మానేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాలన కొనసాగిస్తుంది తప్పా ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మొండి వైఖరి మానుకొని విద్యార్థులకు రావాల్సిన 12 వేల కోట్ల స్కాలర్షిప్లను బకాయిలను విడుదల చేయాలని, త్వరితగతిన ఉద్యోగులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జార్ఖండ్‌లో విద్యార్థులు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అంతా ఏకం చేసి సీఎం రాజీనామా చేసేంతవరకు ఏబీవీపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు మల్యాల రాకేష్, అజయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ బామాండ్ల నందు, కార్యకర్తలు అజయ్, శివ, విగ్నేష్, ఆకాష్, యశ్వంత్, నిత్య, బన్నీ, రాజేందర్, సూర్య, వంశీ, తదితరులు పాల్గొన్నారు.






