18-02-2026 12:12:28 AM
రాళ్ల దాడి చేసుకున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు.. పలువురికి గాయాలు
పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య తోపులాట
వాయిదా పడిన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
మంచిర్యాల, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ఘర్షణ వాతావరణంలో ముగిసింది. ఈ నెల 16న కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉండగా మున్సిపాలిటీ ఆవరణలోకి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు వచ్చారని, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం, ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో స్పెషల్ ఆఫీసర్, మందమరి తహసిల్దార్ సతీష్ కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.
ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. మున్సిపాలిటీకి వెళ్లే దారిలో వాహనాలను మళ్లించారు. అభ్యర్థులను మాత్రమే లోపటికి అనుమతించారు. బీఆర్‌ఎస్, సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థులు వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో మొదలైన తోపులాట, ఘర్షణ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు గాయాలు సైతం అయ్యాయి.
మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో వస్తుండగా పోలీసులు వారిని ఆపడంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. మరో వైపు నుంచి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామిలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు మున్సిపాలిటీకి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీలో పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు 14 మంది ఉండగా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి ఎనిమి ది మంది ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. స్పెషల్ ఆఫీసర్ ఈ ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలను జరిపించాలని బీఆర్‌ఎస్, పీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు.
అక్రమ కేసులు పెడుతున్నారు: బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళుతున్న 21వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను పోలీసులు అడ్డకొని ఆమెపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.