2 July, 2026 | 1:17 AM

పాక్ ఆఫ్గన్ పోరు!

02-07-2026 12:00 AM

పశ్చిమాసియా యుద్ధానికి తెరపడిందని ఊపిరిపీల్చుకున్న యావత్ ప్రపంచానికి దక్షిణాసియా రూపంలో మరో ఉపద్రవం కలవరపెడుతున్నది. భారత సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల తూర్పు ఆఫ్గనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు చేయగా, బలోచిస్థాన్‌లోని సరిహ ద్దు ప్రాంతాలపై డ్రోన్లతో ఆఫ్గన్ తాజాగా విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరుదేశాలకు చెందిన భద్రతా సిబ్బందితో పాటు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరం.

కాగా, తమ భూభాగంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని ఇరుదేశాలు చెబు తుండటం గమనార్హం. అయితే ఈ ఘర్షణలకు ఉగ్రవాదమే కాకుండా సరిహద్దు వివాదం, పరస్పర అనుమానాలు, భద్రతా సమస్యలూ అందుకు ప్రధాన కారణం. రెండు దేశాల సరిహద్దు డ్యూరాండ్ లైన్ ఈ ఉద్రిక్తతలకు మూలకారణమని తెలుస్తున్నది. బ్రిటిష్ పాలకులు గీసిన ఈ సరిహద్దు రేఖను పాక్ అధికారికంగా గుర్తిస్తుండగా, ఆఫ్ఘన్ మాత్రం అంగీకరించడం లేదు.

ముఖ్యంగా ఆఫ్గన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ విషయమై ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. కాగా పఠాన్, బలోచ్, షిన్వారీ వంటి తెగల ప్రజలు డ్యూరాండ్ రేఖకు ఇరువైపులా నివసిస్తుంటారు. చారిత్రకంగా ఒకే సంస్కృతి, సంప్రదాయాలున్న ఈ తెగల ప్రజలు రెండు దేశాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయుధాల అక్రమ రవాణా జరుగుతున్నదని, ఆఫ్గన్ ఆశ్రయం కల్పిస్తున్న ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడుతున్నారని పాక్ ఆరోపిస్తున్నది.

అదే సమయంలో పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు తమ దేశ భద్రతకు ముప్పుగా మారారని ఆఫ్గన్ చెప్తున్నది. అయితే, ఇలా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దాడులకు పాల్పడడం కొత్తేమీ కాదు. కానీ, ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో సైనిక మోహరింపులు పెరగడాన్ని హెచ్చరికగానే చూడాలి.

ఉగ్రవాదంపై చర్యల పేరుతో జరుగుతున్న ఈ దాడుల ప్రభావం సాధారణ ప్రజలపైనే ఎక్కువగా పడుతున్నది. ఇటీవలి యుద్ధాలు సుదీర్ఘంగా కొనసాగుతుండటం, యావత్ ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోవడం వంటి అనుభవాల నేపథ్యంలో సైనిక చర్యల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఇరుపక్షాలు గ్రహించాలి. దక్షిణాసియా స్థిరత్వానికి ముప్పుగా పరిణమించే ఆస్కారమున్న ఈ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పక తప్పదు.