11-11-2025 11:10:25 PM
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది అమాయకులు మరణించడం బాధాకరమని, ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ కూడలి వద్ద ప్ల-కార్డులు చేతబూని ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉన్నాయని ప్రగల్భాలు పలికిన అమిత్ షా, ఇంతటి ఘోరం జరుగుతున్నా ఇంటెలిజెన్స్, రా, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా విభాగాలు నిద్రావస్థలో ఉండటం మోడీ ద్వంద్వ పాలనకు నిదర్శనమన్నారు. అమిత్ షా మన దేశంలో భద్రత కల్పించడంలో తన పాత్రను మరచిపోయి, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికి కోటి రూపాయలు, గాయపడిన వారికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్జ శ్రీనివాసులు, శ్రీమాన్, రాష్ట్ర సమితి సభ్యులు అనిల్ కుమార్, శ్రావణ్, రమేష్, నర్సింహ, కిరణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.