22 July, 2026 | 2:02 AM

టీచర్ల టెట్ నోటిఫికేషన్ విడుదల

22-07-2026 12:00 AM
  1. నేటి నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  2. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు (8 రోజులు )ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆగస్టు 31 నుంచి హాల్‌టెకెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది.

సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్యలో ఫలితాలను వెల్లడించనున్నారు. ఏడాదికి ఇన్‌సర్వీస్ టీచర్లకూ రెండు టెట్‌లను నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ టీచర్లకు ఒక్కో పేపర్‌కు రూ.750, రెండు పేపర్‌లు రాస్తే 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ టీచర్లు, దివ్యాంగ టీచర్లకు ఒక్కో పేపర్‌కు రూ.700, రెండు పేపర్లు రాస్తే 950 రూపాయలు ఫీజు వసూలు చేయనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్ రాసే ఈ టెట్  కేవలం అర్హత కోసం మాత్రమే. దీనికి డీఎస్సీలో ఎలాంటి వెయిటేజీ ఉండదు.

ఎస్జిటీ టీచర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్స్ పేపర్ 1కి అర్హులు కాగా, స్కూల్ అసిస్టెంట్ టీచరు,్ల టీజీటీలు, లాంగ్వేజ్ పండితులు, హైస్కూల్ హెడ్‌మాస్టర్లు పేపర్ 2కి అర్హులు. సర్వీస్‌లో కొనసాగడానికి ప్రమోషన్ల కోసం మాత్రమే ఈ టెట్ ఉపయోగపడుతుంది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. 150 మార్కులకు టెట్ నిర్వహిస్తారు.

ఓసీ టీచర్లకు 90 మార్కులు, బీసీ టీచర్లకు 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ టీచర్లకు 60 మార్కులు అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి విద్యాశాఖ హెల్ప్‌డెస్క్‌లను కూడా అందుబాటులో ఉంచింది.