4 April, 2026 | 4:13 AM

టెక్స్‌టైల్స్ మన జీవనాధారం తెలంగాణ డీఎన్‌ఏ

04-04-2026 02:30 AM

ఐటీ, ఫార్మాతో పాటు వస్త్రరంగంలో అగ్రగామిగాఎదగడమే లక్ష్యం 

2047 నాటికి తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్స్ రాజధానిగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్‌రెడ్డి

టెక్స్‌టైల్స్ నేతన్నకు అందించే సామాజిక న్యాయం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా ప్రపంచ వస్త్రరంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోం దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు వస్త్రరంగంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. టెక్స్‌టైల్స్ రం గం తెలంగాణ డీఎన్‌ఏలోనే ఉంది అని సీఎం చెప్పారు. హైటెక్స్‌లో శుక్రవారం 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్-2026 కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.

ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్-2026లో ఇమేజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ పైన నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘టెక్స్‌టైల్స్ అనేది మనకు కేవలం పరిశ్రమ కాదు, అది మన జీవనధారం. నిజాం కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మన సంస్కృతిలో భాగం’ అని చెప్పారు.

ఈ సద్సస్సులో పాల్గొంటు న్న వారు అతిథులు మాత్రమే కాదని, తెలంగాణ అభివృద్ధి భాగస్వాములు, మా విజన్‌ను పంచుకునే స్నేహితులన్నారు. శతాబ్దా లుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాయన్నారు. తెలంగాణ టెక్స్‌టైల్స్ రంగంలో ముం దంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయని, భారతదేశం లో పత్తి ఉత్పత్తితో పాటు నాణ్యతలోనూ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుందన్నారు.

వరంగల్‌లో ప్రపంచస్థాయి మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటుచేసినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో నైపుణ్యంతో పాటు సంకల్పం ఉందని, డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.

మాకు ఒక విజన్ ఉంది.. 

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకెళ్లుతోందని సీఎం తెలిపారు. ‘2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం మా విజన్. టెక్స్‌టైల్స్ రంగంలోనూ ఒక విజన్ ఉంది. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్స్ రాజధానిగా తీర్చిదిద్దుతా ము. మా ప్రభుత్వం మీకు  మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహ కాలలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుంది..

ప్రపంచానికి సరితూగే విధానాలు మా వద్ద ఉన్నాయి.  అత్యుత్తమ మానవ వనరులు మా బలం.  మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములు. కలిసి, ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం. తెలంగాణ పత్తి పొలాల నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

సినిమా నిర్మాణానికి కేంద్రంగా.. 

హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. ‘ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తాం. పర్యావరణ పరిరక్షణ మా అత్యున్న త ప్రాధాన్యం. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం. యువతకు, ముఖ్యంగా మహి ళలకు, శిక్షణ అందిస్తాం.

సంప్రదాయ ఆలోచనలను ఆధునిక టూల్స్‌లో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించేలా చేస్తాం. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్రం మనది. ఆపిల్ ఇయర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయాలని మా లక్ష్యం.పెట్టుబడిదారులకు నా పిలుపు ఇదే.. మేం కేవలం ఒక రాష్ట్రం కాదు, విజయవంతమైన భాగస్వాములం. కలిసి ఒక కొత్త భవిష్యత్తును నిర్మిద్దాం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలి’ అని సీఎం సూచించారు.  

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి : మంత్రి తుమ్మల

 తెలంగాణలో టెక్స్‌టైల్స్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది వేలాది కుటుంబాల జీవనాధారం, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పేర్కొన్నారు. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభు త్వం టెక్స్‌టైల్స్  రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సంప్రదాయ చేనేత కళలను పరిరక్షిస్తూ, వాటికి ఆధునిక సాంకేతికతను జోడించి, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే స్థాయికి తీసుకు వెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు  ఈ సంస్థ ద్వారా యువతకు ఆధునిక శిక్షణ, డిజైన్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు అందించబడుతున్నాయని తెలిపా రు. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా నూతన ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు 

టెక్స్‌టైల్స్  రంగం ద్వారా ముఖ్యంగా మహిళలు, యువత, గ్రామీణ కుటుంబాలకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్స్ ముఖ్యకార్యదర్శి శైలజరామయ్యర్, ఐఏఎస్  శశాంక, టీఎస్‌ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు, ప్రదర్శకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

వ్యాపారం మాత్రమే కాదు..: మంత్రి శ్రీధర్‌బాబు 

స్వేచ్ఛ కేవలం బ్యాలెట్ బాక్స్ ద్వారా మాత్రమే కాదు, మగ్గం ద్వారా కూడా వస్తుందని స్వదేశీ ఉద్యమంతో వందేళ్ల క్రితమే మహాత్మగాంధీ  నిరూపించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గతాన్ని విస్మరించొద్దని,  భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని, ఆ దిశగానే తెలంగాణ లో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ‘మా దృష్టిలో టెక్స్‌టైల్స్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు.. అది అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయం.

గ్లోబల్ సప్లయ్ చైన్‌లో నేతన్న కేవలం కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలన్నదే మా ప్రభుత్వ సంక ల్పం. ఆ దిశగా నేతన్నలను ప్రోత్సహిస్తున్నాం. అన్నిరకాలుగా అండగా ఉంటు న్నాం. చరఖాకు టెక్నాలజీని అనుసధానించి మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో న్యూస్వదేశీ విజన్‌ను ఈ వేదికపై నుంచే శ్రీకారం చుట్టబోతున్నాం. ఏ దేశం లేదా పరిశ్రమ ఒంటరిగా ఎదగలేదు.

ఇది ఎవరూ కాదనలేని అక్షర సత్యం. అందుకే గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు, సర్య్కూలర్ హబ్స్‌తో తెలంగాణ ను ప్రపంచానికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. డిజిటల్ డిజైన్, గ్లోబల్ కనెక్టివిటీ ద్వారా మన నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో టెక్స్ టైల్ రంగంలో తెలంగాణను కేవలం ఒక ఫ్యాక్టరీలా మాత్రమే కాకుండా, కొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేధో కేంద్రంగా తీర్చిదిద్దేలా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం.

అందు కోసం తక్కువ ధర కంటే, అత్యున్నత నా ణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నాం. బ్లాక్చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ లాంటి టెక్నాలజీస్ సాయంతో సప్లైచైన్‌లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. కేవలం ఉత్పత్తిపైనే కాకుండా ఆవిష్కరణలను ప్రోత్సహించే ఎకోసిస్టం ను అభివృద్ధి చేస్తున్నాం.. అదే మా విజన్ 2047’ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 

ఆకలిని, అసంతృప్తిని మిగిల్చే అభివృద్ధి వ్యర్థం 

‘ఆకలిని, అసంతృప్తిని మిగిల్చే అభివృద్ధి వ్యర్థమని గాంధీజీ చెప్పారు. అందుకే రైతు, నేతన్న, కార్మికుడు,  పెట్టుబడిదారుడు, ఇలా అందరూ కలిసి లాభాలను పంచుకునే కొత్త పారిశ్రామిక వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది’ అని మంత్రి తెలి పారు. ‘ఈ లక్ష్యం పెద్దదే. కానీ.. తెలంగాణ భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు. దాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నామన్నారు. భవిష్యత్తును నిర్మించేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు, నిపుణులను సాదరంగా ఆహ్వాని స్తున్నాం’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.