18 July, 2026 | 6:52 AM

ఆ డాక్టర్ మామూలోడు కాదు!

14-06-2024 12:05 AM

మైనర్ కారు డ్రైవింగ్ కేసులో సంచలనాంశాలు 

వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ వెనుక పెద్ద నెట్‌వర్క్

రక్త నమూనాలు మార్చి శిక్ష తగ్గించడంలో సిద్ధహస్తుడు

ముంబై, జూన్ 13 : మహారాష్ట్ర పూణెలో 17 ఏళ్ల  మైనర్ బాలుడు తప్ప తాగి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు ఐటీ ఉద్యోగులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయపడ్డాయి. కేసు నుంచి మైనర్‌ను తప్పించడానికి సహకరించిన ఒక్కొక్కరిని విచారిస్తుండగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి రక్త నమూనా సేకరించిన డాక్టర్ వెనుక పెద్ద రాకెట్ నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడి త్రండి బడా రియల్టర్ విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ససూన్ ఆసుప్రతి ప్యూన్ అతుల్ ఘాల్ కాంబ్లేకి రూ. 3 లక్షలు ముట్టజెప్పినట్లు ధ్రువీకరించారు. తన డ్రైవర్ ద్వారా మధ్యవర్తికి రూ. 4 లక్షలు అందజేసిన విశాల్ అగర్వాల్.. దీనిలో రూ. 3 లక్షలను ఆసుపత్రి ప్యూన్‌కు చెల్లించారు. ఇప్పటికే ఆస్పత్రి ప్యూన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్ మకాన్‌దార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అమర్ గైక్వాయిడ్ అనే వ్యక్తి కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు. 

డాక్టర్ తావ్‌డేపై గతంలోనే పలు కేసులు

ససూన్ ఆసుపత్రిల్లోని ఫోరెన్సిక్ విభా గం పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నా యి. ఈ విభాగం అధిపతి డాక్టర్ అజెయ్ తావ్‌డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తావ్‌డే రక్త నమూనాలు మార్చేయడం ఇదే తొలిసారి కాదని, ఇతడి నెట్ వర్క్ పుణె చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు క్రైం బ్రాంచ్ అధికారులు పేర్కొన్నారు. ఏదైనా హైప్రొఫైల్ కుటుంబం మద్యపానం చేసి వాహనాన్ని నడిపినట్లు కేసు నమోదైతే.. ఈ నెట్‌వర్క్ ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. కొంత మొత్తం డబ్బు తీసుకొని రక్త నమూనాలు మార్చేసి తక్కువ శిక్ష పడేలా చేస్తుంది. కేసును బట్టి కనీసం రూ. 5 లక్షలు వసూలు చేస్తారని, దాదాపు రెండేళ్ల నుంచి ఈ నెట్‌వర్క్ చురుగ్గా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్ తావ్‌డేపై గతంలోనూ డ్రగ్స్ కేసులు, కిడ్నీ మార్పిడి రాకెట్ వంటి ఆరోపణలు వినిపించినప్పటికీ.. అతడిని ఫోరెన్సిక్ విభాగ అధిపతిగా పదోన్నతి కల్పించారు.