వాళ్లది పారదర్శకం.. మనది రిగ్గింగ్
భారత్, పాక్ ఎన్నికల నిర్వహణపై పాక్ నేత
ఇస్లామాబాద్, జూన్ 13: భారత్‌లో దాదాపు 90 కోట్ల మంది ఓటర్లున్నా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుండగా, పాకిస్థాన్‌లో రిగ్గింగ్‌తో ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆ దేశ సెనేటర్ షిబ్లి ఫరాజ్ ఆవేదన వ్యక్తంచేశారు. పాకిస్థాన్ ఎగువసభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన భారత్ లో ఎన్నికల నిర్వహణను కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లున్న భారత్‌లో అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించారని ప్రశం సించారు. గురువారం ఆయన పాక్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘అక్కడ (ఇండి యా) ఇటీవలే ఎన్నికలు నిర్వహించారు. 80 కోట్లకు మించి ఓటర్లు ఉన్నారక్కడ. వేలకొద్ది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్క ఓటరు ఉన్నచోట కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఒక నెలపాటు ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఎన్నికల్ల రిగ్గింగ్ జరిగిందని ఒక్క గొంతు కూడా మాట్లాడటం వినిపించలేదు. మనం కూడా అలా ప్రగతి సాధించాలి’ అని పేర్కొన్నారు.






