12 April, 2026 | 5:39 AM

గీత దాటితే అంతే!

07-02-2025 01:49 AM
  1. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి 
  2. ఇక డిన్నర్ మీటింగ్‌లు వద్దు 
  3. సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

* ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్‌లో, కులగణనపై సూర్యాపేటలో బహిరంగ సభలు ఖర్గే, రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : కాంగ్రెస్ శాసనసభాపక్ష సమా వేశం హాట్ హాట్‌గా సాగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడంతో పాటు ఇటీవల ఎమ్మెల్యేల రహస్య భేటీపై గురువారం సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది.

కులగణన ను వ్యతిరేకించడమే కాకుండా కులగణన ప్రతులను కాల్చివేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి పలువు రు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ పార్టీలో ఎంత పెద్ద నాయకులైనా పార్టీ గీత దాటొద్దని హెచ్చరించారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కేబినెట్‌లో ఆమోదం పొందాక సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తే ప్రజలోకి తప్పుడు సంకేతాలు వెళ్లుతాయని, వాటి ని బయట  మాట్లాడొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుద్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల సమావేశం అంశంపైన చర్చ జరిగింది.

తమ సమావేశంలో ఎలాంటి రాజకీయం లేదని, డిన్నర్ కోసమే కలిశామని ఎమ్మె ల్యే అనిరుద్‌రెడ్డి, మరి కొందరు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ పార్టీలో ఏమైనా అంతర్గత సమస్యలుంటే  చెప్పుకోవడానికి తనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అందుబాటులో ఉంటామన్నారు.

అవసరమైతే ఏఐసీసీ అధ్యక్షు డు మల్లిఖార్జున ఖర్గేను కలిసి కూడా సమస్యలు చెప్పుకోవచ్చని సీఎం సూచించా రు. ఇక నుంచి డిన్నర్ మీటింగ్‌లు పెట్టుకోవద్దని, అవసరమైతే గాంధీభవన్‌లో అందరూ కూర్చొని సమావేశాలు ఏర్పా టు చేసుకోవాలని సీఎం హితవు పలికారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలన్నా రు.

పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడి వరకు కలిసికట్టుగా ఉంటేనే అన్నింటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని సీఎం సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన  కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

అసైన్డ్ భూముల కబ్జాపై విచారణ.. 

బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అసైన్డ్ భూముల కబ్జాపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి  చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కొందరకు బీఆర్‌ఎస్ నాయకులు కబ్జాలు చేశారని  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి  సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆధారాలతో సహా వినతిపత్రాలు అందజేశారు.

పఠాన్‌చెరు నియోజక వర్గంలోని ఆమీన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీలు అసైన్డ్ భూములను అక్రమించారని, దీనిపై విచారణ జరపాలని గతంలో కోరితే పట్టించుకోలేదని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల కోసమే ఆలోచన చేస్తుందని, ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడిన వారిలో ఎవరున్నా సహించేది లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. 

సమన్వయంతో ముందుకెళ్లాలి : దీపాదాస్ మున్షీ 

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు నుంచి కార్యకర్తల వరకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సూచించారు. పార్టీ నిర్ణయాలపై బహాటంగా విమర్శలు చేయవద్దన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపైన ఆమె ఆరా తీసినట్లుగా తెలిసింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ సమస్యలుంటే.. వారితో మాట్లాడి  పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల రహస్య సమావేశం అనేది జరగలేదని, ఎమ్మెల్యేలు కలిసి డిన్నర్ చేస్తే తప్పేంటన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు క్రమశిక్షణ కింద నోటీసు ఇచ్చామన్నారు. ఒక వేళ నోటీసు రాలేదంటే మళ్లీ ఇస్తామన్నారు. మల్లన్న నుంచి వివరణ వచ్చాక చర్యలు ఉంటాయని తెలిపారు. 

డిప్యూటీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్  

సీఎల్పీ సమావేశంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వర్గీకరణ, కుల గణనపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉందని, అయినప్పటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని, అందుకనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, కులగణన చేపట్టిందన్నారు. కులగణనతో బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయని, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భట్టి సూచించారు.      

గజ్వేల్, సూర్యాపేటలో సభలు

దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిష్కరించిందని, అందుకు రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలను ఈ నెలలోనే  ఏర్పాటుచేయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయిం చారు.

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షడు మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానిం చి గజ్వెల్‌లో, బీసీ కుల గణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించి సూర్యాపేటలో సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  తెలిపారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కోసమే కేటీఆర్ ఢిల్లీకి పోయారని విమర్శించారు.

ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశామని, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్లు చెప్పారు. కులగణన విషయంలో బీసీ సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యవహారిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వర్గీకరణ, కులగణనపై ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.  

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం పదవులు..   

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం  రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉం డేలా, బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చూ డాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. బీసీ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి, వారికి అధికారంలో మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 

పాత, కొత్త నేతలు సమన్వయంతో పని చేయాలి.. 

స్థానిక సంస్థల్లో  విజయమే లక్ష్యంగా పని చేయాలని అందుకు పాత, కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. పార్టీ నేతలు, కేడర్ అంతా ఒకతాటిపై నిలిచి పనిచేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరింత దృఢంగా నిలిచేలా చేస్తుందని, అందుకు ప్రతి నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎన్నికల ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రజలకు చేరవుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను గట్టిగా ప్రచారం చేయాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలు చారిత్రాత్మక నిర్ణయాలని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.

మండలాల వారిగా సమావేశాలు నిర్వహించే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులు తీసుకో వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపే తానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పూర్తి స్థాయి లో పని చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలా న్ని పెంపెందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

ఏడాదిలో ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయాలని సీఎం సూచించా రు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ది, వివిధ నిర్మాణలకు అనుమతులు మంజూరు చేయడం, నిధులు కేటాయింపు కోసం తక్షణమే మంత్రును కలవాలన్నారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు ఉచిత కరెంట్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర పథ కాలను ప్రజలకు వివరించాలన్నారు.